జ్ఙానవాపిలో పూజలు ఆపలేం: సుప్రీం

జ్ఙానవాపిలో పూజలు ఆపలేం: సుప్రీం
  • మసీదు కమిటీ పిటిషన్​పై మీ స్పందనేంటి?
  • ఆలయ ధర్మకర్తలను కోరిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు దక్షిణం వైపు ఉన్న సెల్లార్​లో హిందువులు పూజలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సెల్లార్​లో పూజలకు అనుమతి నిరాకరించాలని కోరుతూ మసీదు మేనేజ్​మెంట్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించేందుకు అత్యున్నత న్యాయ స్థానం నిరాకరించింది. అలాగే, మసీదు కమిటీ చేసిన విజ్ఞప్తిపై కాశీ విశ్వనాథ ఆలయ ధర్మకర్తల అభిప్రాయం కోరింది. మసీదు ఆవరణలో ముస్లింలు నమాజ్ చేయడంపై స్టేటస్ కో కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మసీదు సెల్లార్​లో హిందువులు పూజలు చేసుకోవచ్చని అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జ్ఞానవాపి మసీదు మేనేజ్​మెంట్ కమిటీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోనే జస్టిస్ జేబీ పార్డివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘మసీదు దక్షిణ భాగంలోని సెల్లార్​లో పూజలకు అనుమతి నిరాకరించాలని కోరుతూ మసీదు కమిటీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఏప్రిల్ 30లోగా చెప్పండి’’అని పూజారి శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్​ను సీజేఐ కోరారు. 

సెల్లార్​లో పూజలకు అనుమతిస్తూ జనవరి 31న అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మసీదు మేనేజ్​మెంట్ కమిటీ హైకోర్టుకు వెళ్లింది. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్​ను ఫిబ్రవరి 26న హైకోర్టు కొట్టేసింది. దీంతో కమిటీ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయ స్థానం కూడా పూజలు కొనసాగించాలని ఆదేశిస్తూనే.. కమిటీ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్​ను విచారించేందుకు నిరాకరించింది. పిటిషన్‌‌ను ఫైనల్‌‌గా జులైలో విచారిస్తామని తెలిపింది. కాగా, మసీదు దక్షిణ సెల్లార్​లో ఉన్న ‘వ్యాస్ తెహఖానా’లో పూజలు చేయడాన్ని నిలిపివేస్తూ 1993లో యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఇది చట్టవిరుద్ధమని అప్పట్లో అసహనం వ్యక్తం చేసింది.