రేడియల్‌‌‌‌ రోడ్డు టెండర్ల పంచాదీ..  హైకోర్టులోనే తేల్చుకోండి!.సుశీ ఇన్‌‌‌‌ఫ్రాకు సుప్రీంకోర్టు స్పష్టం 

రేడియల్‌‌‌‌ రోడ్డు టెండర్ల పంచాదీ..  హైకోర్టులోనే తేల్చుకోండి!.సుశీ ఇన్‌‌‌‌ఫ్రాకు సుప్రీంకోర్టు స్పష్టం 

 

  • కొత్త కాంట్రాక్టర్లను కూడా ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశం 
  • కేసు త్వరగా తేల్చాలని హైకోర్టుకు సూచన.. అప్పటివరకు కొత్త సంస్థలకు ఈక్విటీ ప్రయోజనాలు వద్దు

న్యూఢిల్లీ, వెలుగు:  కొత్వాల్‌‌‌‌గూడ నుంచి -కొడంగల్‌‌‌‌ రేడియల్‌‌‌‌ రోడ్డు టెండర్ల వివాదాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెండర్లలో అన్యాయం జరిగిందంటూ ‘సుశీ ఇన్‌‌‌‌ఫ్రా అండ్‌‌‌‌ మైనింగ్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌’ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై గురువారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌‌‌‌ సూర్యకాంత్‌‌‌‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

కొత్తగా కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలను కూడా కేసులో ప్రతివాదులుగా చేర్చాలని సూచించింది. వీలైనంత త్వరగా కేసును పరిష్కరించాలని హైకోర్టును కోరింది. అప్పటివరకు కొత్త సంస్థలకు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి ఈక్విటీ ప్రయోజనాలు కల్పించవద్దని పేర్కొంది. హైదరాబాద్‌‌‌‌ గ్రోత్‌‌‌‌ కారిడార్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (హెచ్‌‌‌‌జీసీఎల్‌‌‌‌) ఆధ్వర్యంలో రూ.3,296 కోట్లతో కొత్వాల్‌‌‌‌గూడ (బుద్వేల్‌‌‌‌) నుంచి నేషనల్‌‌‌‌ హైవే 167ఎన్‌‌‌‌ పరిధిలోని నాచారం-కోస్గి/కొడంగల్‌‌‌‌ వరకు 81.15 కిలోమీటర్ల మేర రేడియల్‌‌‌‌ రోడ్డు ప్యాకేజ్‌‌‌‌-2 నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలిచింది.

ఈ టెండర్లలో సుశీ ఇన్‌‌‌‌ఫ్రా సమర్పించిన అనుభవ ధ్రువీకరణ పత్రంపై ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌ సంతకం లేదంటూ ఆ సంస్థను అనర్హురాలిగా ప్రకటించారు. దీనిని సవాల్‌‌‌‌ చేస్తూ సుశీ ఇన్‌‌‌‌ఫ్రా హైకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు..

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతానికి టెండర్ల ప్రక్రియను అడ్డుకోలేమని హైకోర్టు పేర్కొంది. ప్రతివాదులు కౌంటర్‌‌‌‌ దాఖలు చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో విచారిస్తామని తెలిపింది. దీంతో సుశీ ఇన్‌‌‌‌ఫ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గురువారం జరిగిన విచారణలో ఆ సంస్థ తరఫున సీనియర్‌‌‌‌ అడ్వొకేట్‌‌‌‌ నిరంజన్‌‌‌‌ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, హెచ్‌‌‌‌జీసీఎల్‌‌‌‌ తరఫున సీనియర్‌‌‌‌ అడ్వొకేట్‌‌‌‌ ముకుల్‌‌‌‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ అంశం ఇప్పటికే హైకోర్టులో పెండింగ్‌‌‌‌లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో పిటిషన్‌‌‌‌పై విచారణను ముగించింది.