జిల్లా జడ్జిల నియామకాలను రెండు నెలల్లో పూర్తి చేయాలి : సుప్రీంకోర్టు

జిల్లా జడ్జిల నియామకాలను రెండు నెలల్లో పూర్తి చేయాలి : సుప్రీంకోర్టు
  • తెలంగాణ జ్యుడీషియల్సర్వీస్ రిక్రూట్మెంట్ ఎగ్జాంపై సుప్రీంకోర్టు తీర్పు  

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో 2023లో నిర్వహించిన జ్యుడీషియల్ సర్వీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఫలితాలను వెంటనే వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 నెలల్లో జిల్లా జడ్జిల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కోర్టుల్లో ఏడేండ్లు ప్రాక్టీసు చేసి ఉంటేనే జిల్లా జడ్జిలుగా నియమించాలని గతంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. 

ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ప్రకటించింది. తొలుత పిటిషనర్ తరపు అడ్వకేట్ సాగర్ వాదనలు వినిపిస్తూ.. 2023 నాటి రూల్స్ సడలించకుండా, అర్హత పొందిన వారిని జిల్లా జడ్జిలుగా నియమించేందుకు తమకు అభ్యంతరం లేదని కోర్టుకు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నివేదించారు. 

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. అర్హులైన వారిని జిల్లా జడ్జిలుగా నియమించేందుకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, ఈ ఉత్తర్వులు భవిష్యత్తులో చేపట్టబోయే నియామకాలకు వర్తించదని, 2003 నాటి రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అభ్యర్థులకు మాత్రమేనని పేర్కొంది.