వేటు పడింది.. బైపోల్ కు వెళ్లండి... చట్టసభలకు ‘ఘర్ వాపసీ’ వర్తించదు: దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు

వేటు పడింది.. బైపోల్ కు వెళ్లండి... చట్టసభలకు ‘ఘర్ వాపసీ’ వర్తించదు: దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు
  • ఒక పార్టీ నుంచి గెలిచి... మరో పార్టీ నుంచి పోటీ సరికాదు
  • ఈ విషయంలో హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నాం
  • పిటిషన్​ను డిస్మిస్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ, వెలుగు: దానం నాగేందర్​కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అనర్హత వేటు అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌‌ను కోర్టు కొట్టివేసింది. ఒక పార్టీ నుంచి గెలిచి.. మరో పార్టీ నుంచి పోటీ చేయడాన్ని తప్పు బట్టింది. పార్టీల్లోకి ‘ఘర్ వాపసీ’ ఉండొచ్చని.. కానీ, చట్ట సభలకు ఇది వర్తించదని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పును సమర్ధిస్తున్నట్టు పేర్కొంటూ.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని.. ఉప ఎన్నికకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. 
 
ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌‌ సూర్యకాంత్‌‌, జస్టిస్‌‌ జాయ్‌‌మాల్య బాగ్చీ, జస్టిస్‌‌ వి.మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దానం పిటిషన్​పై గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి, బీజేపీ ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫున సీనియర్ అడ్వకేట్ మహేశ్ జఠ్మలాని, బీఆర్ఎస్ తరఫున సీనియర్ అడ్వకేట్ గండ్ర మోహన్ రావు, ఏఓఆర్ పీ మోహిత్ రావు హాజరయ్యారు. 

స్పీకర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నారు.. 

తొలుత దానం తరఫున అడ్వకేట్​ముకుల్‌‌ రోహత్గీ వాదిస్తూ.. ఇప్పటికీ స్పీకర్ తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నే గుర్తిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పదో షెడ్యూల్‌‌లోని 2(1)(బి)ను ప్రస్తావిస్తూ.. పార్టీ విప్‌‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన సభ్యుడి చర్యను పార్టీ క్షమించగల నిబంధన ఉందని వివరించారు. అయితే, ఆ నిబంధన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి సంబంధించిన 2(1)(ఎ)కు వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. 

బీఆర్ఎస్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకొని.. తాము పిటిషనర్ ను ‘ఘర్ వాపసీ’ గా చూడడం లేదన్నారు. దానం చర్యను పార్టీ క్షమించలేదని, ఆయనపై అనర్హత పిటిషన్‌‌ దాఖలు చేసిందని కోర్టుకు నివేదించారు. అంతేకాకుండా, దానంపై ఫిరాయింపు పిటిషన్ వేసింది కూడా బీఆర్ఎస్‌‌ ఎమ్మెల్యేనేనని తెలిపారు. 

ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు పదో షెడ్యూల్‌‌ను చట్టపరంగా సరైన రీతిలో అర్థం చేసుకుని తీర్పు ఇచ్చిందన్నారు. అందులో జోక్యం చేసుకునే కారణం లేదని స్పష్టం చేస్తూ... దానం నాగేందర్‌‌ పిటిషన్‌‌ను కొట్టివేసింది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మరోసారి పోటీ చేయాలని సూచించింది. దీంతో హైకోర్టు తీర్పు మేరకు ఖైరతాబాద్‌‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది.

కేసు పూర్వాపరాలు ఇలా.. 

ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్.. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫాంపై బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్, బీజేపీ ఫిర్యాదు చేశాయి. దీనిపై సుప్రీం ఆదేశాలతో విచారణ జరిపిన స్పీకర్.. దానం చట్టపరంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని మార్చి 11న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు సీజే బెంచ్.. గత శుక్రవారం దానం అనర్హత వేటు వేస్తూ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 

బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2024 లోక్‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌‌ నుంచి పోటీ చేసిన అంశాన్ని అనర్హతకు ఆధారంగా హైకోర్టు పరిగణించింది. 2024 ఏప్రిల్‌‌ 23 నుంచి అనర్హత అమల్లోకి వస్తుందని హైకోర్టు పేర్కొంది. అలాగే, ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్టు స్పీకర్, ఈసీకి సమాచారం ఇచ్చింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ...  దానం నాగేందర్ ఈ నెల 19 వ తేదీన సుప్రీకోర్టు లో ఎస్ఎల్పీ దాఖలు చేశారు.

బీఆర్ఎస్ కు మొఖం చెల్లకే కోర్టులను ఆశ్రయించింది..

దానం నాగేందర్ విషయంలో బీఆర్ఎస్ కు మొఖం చెల్లక స్పీకర్, కోర్టులను ఆశ్రయించిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపు అడ్వకేట్ మహేశ్ జఠ్మలాని కోర్టుకు తెలిపారు. దానం వ్యవహారంలో బీఆర్ఎస్, స్పీకర్ ఫిరాయించినట్లు గుర్తించలేదని రోహిత్గి చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం, ఏలేటి తరపు జఠ్మలాని స్పందించారు. తాము ఈ వ్యవహారంలో ఏరోజు జాలీగా లేమని, ఫిరాయింపుపై తామే స్పీకర్, కోర్టులను ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ విషయంలో ముఖం చెల్లక బీఆర్ఎస్ సైతం ఫిరాయింపు ఫిర్యాదు, పిటిషన్లు వేసినట్లు తెలిపారు.

ఆయారాం.. గయారాం.. చట్టసభలకు వర్తించదు..

పార్టీ మార్పు అంశంపై విచారణ సందర్భంగా దానం తరఫు న్యాయవాది ముకుల్‌‌ రోహత్గీ వాదనల నేపథ్యంలో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయారాం.. గయారాం.. ఫిర్‌‌ ఆయారాం (వచ్చారు.. వెళ్లారు.. మళ్లీ వచ్చారు) అని హిందీలో కామెంట్ చేసింది. దానం ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లి, తిరిగి సొంత ఇంటికి వచ్చినట్టుగా వాదిస్తున్నారా? అని రోహిత్గిని ప్రశ్నించింది. ఆయారాం.. గయారాం.. చట్టసభల కు వర్తిం చదని పేర్కొంది. పదో షెడ్యూల్‌‌లోని 2(1)(బి) నిబంధన.. పార్టీ విప్‌‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన అంశాలకు మాత్ర మే వర్తిస్తుందని స్పష్టం చేసింది. 

పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడానికి సంబంధిం చిన 2(1)(ఎ) కు వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకపోయినా లేదా అధికా రికంగా రాజీనా మా పత్రం ఇవ్వకపోయినా, వేరే రాజకీయ పార్టీ టికెట్‌‌పై నామినేషన్ వేసి పోటీ చేయడం రాజ్యాం గబద్ధంగా పార్టీని వీడినట్లే అవుతుందని పేర్కొంది. ‘స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్షకు  లోబడి ఉం టుం ది.. సుస్పష్టమైన ఆధారాలు (మరో పార్టీ బీ-ఫారమ్‌‌పై పోటీ చేయడం) ఉన్నప్పుడు స్పీకర్ చర్య తీసుకోకపో వడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది’ అని స్పష్టం చేసింది. పార్టీల వ్యవహారం చట్ట సభలకు వర్తించదని గుర్తు చేసింది.