- జీడిమెట్ల భూసర్వే వ్యవహారంలో దక్కని ఊరట
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. జీడిమెట్ల భూ సర్వే వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారికి ఊరట దక్కలేదు. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. జీడిమెట్లలోని సర్వే నం 82/1/ఈఈలో భాగమైన 0.33 గుంటల విస్తీర్ణంలోని భూమి హద్దులు నిర్ణయించేలా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని కోరుతూ శేరి శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. మల్లారెడ్డి, ఇతరులు కలిసి ఆ భూమికి రోడ్డు పక్కన వాణిజ్య సముదాయాలను నిర్మించారని తన పిటిషన్లో ఆరోపించారు.
దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. దరఖాస్తు అందిన తేదీ నుంచి 45 పనిదినాల్లో చట్టప్రకారం సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేశారు. వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థిస్తూ మల్లారెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేశారు. హైకోర్టు తీర్పును ఫిబ్రవరి 13న ఈ ముగ్గురూ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
