న్యూఢిల్లీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండం నాగారంలో భూదాన్ భూముల వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నాగారం భూములను భూదాన్ భూములుగా పేర్కొంటూ కొందరు ఐఏఎస్, ఐపీఎస్, వారి బంధువులు అక్రమంగా కొనుగోలు చేశారని బిర్లా మల్లేశ్ అనే వ్యక్తి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం.. ఐఏఎస్, ఐపీఎస్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ గత నెల 15న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది.
ఇందులో తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీబీఐ, ఐఏఎస్లు నవీన్ మిట్టల్, రాజర్షి షా, అజయ్ జైన్, అమోయ్ కుమార్, హరీశ్, ఐపీఎస్లు మహేశ్ భగవత్, శ్రీనివాస్ రావు, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, తరుణ్ జోషితో పాటు మొత్తం105 మంది ప్రతివాదులుగా చేరారు. ఈ పిటిషన్ను మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కూడిన బెంచ్ విచారించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పునే ధర్మాసనం సమర్థించింది. ఈ వ్యవహారంలో ముందుకెళ్లలేమని ప్రాథమిక దశలోనే పిటిషన్ను కొట్టివేసింది.
