
- పురుషోత్తం రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. విభజన చట్టం– -2014లోని సెక్షన్ 26ను అమలు చేయాలని ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. అనంతరం పిటిషన్‌పై విచారణ ముగించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం.. శుక్రవారం తీర్పు వెలువరించింది.
‘ఈ పిటిషన్‌లో న్యాయబద్ధత ఏదీ కనిపించడం లేదు. అందుకే కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం, 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన జరగగలదని స్పష్టం చేసింది. తద్వారా సెక్షన్ 26 రాజ్యాంగ పరిమితులకే లోబడి ఉందని అభిప్రాయపడింది. కాగా, ఇలాంటి పిటిషన్లు స్వీకరిస్తే దేశంలోని మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి పిటిషన్లు వరదలా వచ్చి, కోర్టులపై భారంగా మారే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది.