రోడ్డు ప్రమాదాల నివారణకు.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్

రోడ్డు ప్రమాదాల నివారణకు.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్
  • యాక్సిడెంట్​ ఘటనలపై సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ
  • టోల్ వసూలు దేనికంటూ ఎన్ హెచ్ఏఐపై గుస్సా
  • రోడ్ల పక్కన దాబాలు, హోటల్స్​ వల్లే యాక్సిడెంట్లు
  • 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ: జాతీయ రహదారులు, ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేలపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదాలను నివారించడానికి దేశవ్యాప్తంగా అమలయ్యేలా కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీంకోర్టు యోచిస్తున్నది. దేశంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను ఎన్​హెచ్ఏఐ అసమర్థతకు పరాకాష్టగా కోర్టు అభివర్ణించింది. 

ఇవి వ్యవస్థలోని వైఫల్యాలకు నిదర్శనం కాదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇటీవల రాజస్థాన్‌‌‌‌లోని ఫలోదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15మంది చనిపోయారు. ఏపీలోని శ్రీకాకుళం, తెలంగాణలోని చేవెళ్ల వద్ద జరిగిన ప్రమాదాల్లోనూ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ యాక్సిడెంట్లపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.

జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్నోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై సీరియస్‌‌‌‌గా చర్చించింది. ‘‘టోల్ వసూలు దేనికి? ప్రజల ప్రాణాలు తీయడానికా?’’ అంటూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ)పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.  టోల్ చార్జీలు వసూలు చేస్తున్నారే తప్ప రోడ్ల నాణ్యత గురించి పట్టించుకోవడం లేదని, నిర్వహణ లోపంతో రోడ్లపై గుంతలు పడుతున్నాయని తెలిపింది.

ఫలోదిలాంటి యాక్సిడెంట్లు రిపీట్ కావొద్దు

జాతీయ రహదారుల పక్కన అనుమతిలేకుండా ఏర్పాటుచేసిన దాబాలు, టీ దుకాణాల వద్ద ట్రక్కులు ప్రమాదకర రీతిలో నిలిపివేయడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘యాక్సిడెంట్లు జరిగిన జాతీయ రహదారులపై భద్రతా ప్రమాణాలు, నిర్వహణ, కాంట్రాక్టర్ల పనితీరు, రోడ్ల పక్కన ఉన్న అక్రమ దాబాల సంఖ్యపై సర్వే నిర్వహించి 2 వారాల్లోగా ఎన్​హెచ్ఏఐ, కేంద్ర రవాణ శాఖ సమగ్ర నివేదిక సమర్పించాలి.

 ప్రస్తుతం ఉన్న నిబంధనలలోని లోపాలను  సరిదిద్దాలి. ఫలోది లాంటి యాక్సిడెంట్లు మళ్లీ రిపీట్ కాకుండా నివారించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలి’’ అని ధర్మాసనం పేర్కొన్నది. రోడ్ల నిర్వహణపై వివరణ ఇవ్వాలని, అక్రమ నిర్మాణాల నియంత్రణ కోసం గైడ్​లైన్స్  తేవాలని సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 

తమ దృష్టిలో.. రోడ్ల నిర్వహణ అనేది కేవలం నిర్మాణం మాత్రమే కాదని, ప్రజల భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతా చర్యలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.