ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావు కస్టడీ 25 వరకు పొడిగింపు

ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ప్రభాకర్రావు కస్టడీ 25 వరకు పొడిగింపు
  • 26న విడుదల చేయాలి: సుప్రీంకోర్టు
  • ఆ తర్వాత కూడా ఆయనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశం
  • తదుపరి విచారణ జనవరి 16కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంటరాగేషన్ ను సుప్రీంకోర్టు మరో వారం రోజులు పొడిగించింది. ఈ నెల 25 వరకు ఆయన కస్టడీకి అనుమతించింది. కస్టడీ టైంలో ప్రభాకర్ రావుపై ఫిజికల్ టార్చర్ చేయకుండా ఇంటరాగేషన్ చేయాలన్న గత ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. అలాగే, మందులు, ఇంటి నుంచి భోజనానికి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

26వ తేదీన ఆయనను రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణనను జనవరి 16 కు వాయిదా వేసింది. కస్టడీ నుంచి రిలీజ్ అయిన తదుపరి విచారణ తేదీ వరకు ప్రభాకర్ రావు పై ఎలాంటి బలవంతపు చర్యలు(అరెస్ట్) తీసుకోవద్దని స్పష్టం చేసింది. అలాగే, దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిచినా(సమన్లు పంపినా) విచారణకు హాజరై సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

శుక్రవారం పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ సుదీర్ఘ విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్ జీ) తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ సిద్దార్థ్ లూత్రా.. ప్రభాకర్ రావు తరఫున అడ్వకేట్ రంజిత్ కుమార్, శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు.

దర్యాప్తుకు సహకరించడం లేదు

తొలుత ప్రభుత్వం తరఫున ఎస్ జీ మెహతా వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం ఆదేశాల మేరకు విచారణ అధికారి ముందు ప్రభాకర్ రావు లొంగిపోయారని.. కానీ, దర్యాప్తుకు సహకరించడం లేదన్నారు. ఇతరులతో కలిపి ప్రభాకర్ రావును విచారించాల్సి ఉందని, అందుకోసం మరోసారి వారం రోజులు కస్టోడియల్ ఇంటరాగేషన్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించారు.

జైలుకెళ్తావంటూ బెదిరిస్తున్నరు

ప్రభుత్వ వాదనలను పిటిషనర్ తరఫు అడ్వకేట్ రం జిత్ కుమార్ ఖండించారు. ప్రభాకర్ రావు 17 సార్లు దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారని.. గడిచిన ఏడు రోజుల్లో 97 గంటలు విచారణకు సహకరించినట్టు చెప్పారు. ‘స్వీయ నేరారోపణ ప్రకటన, ఇతరులపై నేరారోపణ’( తప్పు చేశానని ఒప్పుకోవడం, ఇందులో ఇతరుల పేర్లు చెప్పడం) చేసేలా ప్రశ్నలు అడుగుతున్నారన్నారు. ఆర్టికల్ 20, 21ను ఉల్లంఘిస్తున్నారన్నారు. 

అందువల్ల తదుపరి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని కోర్టుకు నివేదించారు. ‘మేం చెప్పినట్టు నువ్వు అంగీకరించు.. ఈ కేసు నుంచి బయటకు వస్తావు. లేదా ఒప్పుకోకపోతే ఈ కేసులో ఏడేండ్లు జైలుకు వెళ్తావు’ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రభాకర్ రావు తరఫు మరో అడ్వొకేట్ శేషాద్రి నాయుడు వాదించారు.