అభ్యర్థులు అన్ని వివరాలు చెప్పనక్కర్లేదు : సుప్రీంకోర్టు

అభ్యర్థులు అన్ని వివరాలు చెప్పనక్కర్లేదు : సుప్రీంకోర్టు
  • ఆస్తుల డిక్లరేషన్ పై క్లారిటీ ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం
  • నేతలకూ ప్రైవసీ హక్కు ఉంటుందని కామెంట్

న్యూఢిల్లీ: ఎన్నికల బరిలో ఉన్న వ్యక్తి ఆస్తుల వివరాలను వెల్లడించాలనే రూల్​కు సుప్రీంకోర్టు కొత్త బాష్యం చెప్పింది. ఆస్తులన్నీ అంటే విలువైన, సీజ్ చేయదగిన ఆస్తులని వివరించింది. చరాస్తుల వివరాలలో బట్టలు, స్టేషనరీ, ఫర్నీచర్.. తదితర ఆస్తుల్లో బాగా విలువైనవి ఉంటే తప్ప వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకూ ప్రైవసీ హక్కు ఉంటుందని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్​ల బెంచ్ గుర్తుచేసింది. 

అరుణాచల్ ప్రదేశ్​ఎమ్మెల్యే కరిఖో క్రి ఎన్నిక వివాదంపై ఈ తీర్పు వెలువరించింది. 2019లో జరిగిన అరుణాచల్ ప్రదేశ్ ​ఎన్నికల్లో కరిఖో క్రి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఆయన తన ఆస్తుల వివరాలన్నీ అఫిడవిట్​లో పేర్కొనలేదని ఆరోపిస్తూ కరిఖో పై పోటీ చేసిన అభ్యర్థులు గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ వసతి సదుపాయం ఉపయోగిస్తూ ఆ విషయాన్ని అఫిడవిట్​లో పేర్కొనలేదని, నో డ్యూ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో గౌహతి కోర్టు కరిఖోపై అనర్హత వేటు వేసింది. ఈ తీర్పును కరిఖో అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.