
- పంజాబ్ సర్కారును ప్రశ్నించిన సీజేఐ ఎన్వీ రమణ
- ఎన్నికలయ్యే దాకా మజితియాను అరెస్టు చేయొద్దని ఆర్డర్
న్యూఢిల్లీ: ఎలక్షన్స్ ముందే అరెస్టులు ఎందుకు చేస్తున్నారని కామెంట్ చేసిన సుప్రీంకోర్టు.. డ్రగ్స్ కేసులో అకాలీదళ్ లీడర్ విక్రమ్ సింగ్ మజితియాను ఫిబ్రరి 23 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. డెమోక్రసీలో కనీసం నామినేషన్ వేయడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికైనా అవకాశం కల్పించాలని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ‘‘ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. ఎన్నికలకు ముందు ఈ కేసులు ఎందుకు పైకి వస్తున్నాయి. దీనిపై అనుమానపడడానికి ప్రతి ఒక్కరికీ కారణాలు ఉంటాయి’’ అని సీజేఐ కామెంట్ చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి విక్రమ్ పోటీ చేస్తున్నారని, ప్రచారం చేయాల్సి ఉన్నందున ఫిబ్రవరి 23 వరకు ఆయనను అరెస్టు చేయవద్దని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లిల బెంచ్ పంజాబ్ పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 20 తర్వాత ట్రయల్ కోర్టులో విక్రమ్ సింగ్ లొంగిపోవాలని చెప్పింది. లొంగిపోయిన తరువాత ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారించి, నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. ఎన్నికలకు ముందు మీరు సరైన చర్యలు తీసుకుంటున్నట్టుగా అనిపించడం లేదని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలని పంజాబ్ తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ పి.చిదంబరంకు సీజేఐ సూచించారు. అలాగే పంజాబ్ ఎమ్మెల్యే సిమర్జిత్ సింగ్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ వేశారని, దానిని మంగళవారం విచారిస్తామని
సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు.