ఎన్నికలను మేం కంట్రోల్ చేయలేం : సుప్రీంకోర్టు

ఎన్నికలను మేం కంట్రోల్ చేయలేం : సుప్రీంకోర్టు
  • ఈసీ పనితీరును నిర్దేశించలేం 
  • వీవీప్యాట్ ​స్లిప్పుల లెక్కింపు కేసులో స్పష్టీకరణ 
  • కేవలం అనుమానాలతో ఆర్డర్లు ఇవ్వలేమంటూ తీర్పు రిజర్వు 

న్యూఢిల్లీ : ఎన్నికలను నియంత్రించే అధికారం తమకు లేదని, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం(ఈసీ) పనితీరును తాము నిర్దేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌‌(ఈవీఎం)లలో పోలైన ఓట్లను వీవీప్యాట్ సిస్టమ్ స్లిప్‌‌లతో పూర్తిగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ సంస్థ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. బుధవారం పిటిషన్​పై తుది వాదనల సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ఇద్దరు సభ్యుల బెంచ్ ఈ కామెంట్లు చేసింది. 

కేసుపై తీర్పును రిజర్వు చేసింది. ‘‘ఈసీ తమ డౌట్లన్నింటినీ క్లారిఫై చేసింది. కేవలం అనుమానాన్ని బేస్ చేసుకుని ఆర్డర్లు ఇవ్వలేం. అలాగే మీ ఆలోచనావిధానాన్ని కూడా మేం మార్చలేం” అని బెంచ్ పేర్కొంది. ఈవీఎం ఓటింగ్ విధానంపై ప్రతిపక్షాల అనుమానాలు, ఆందోళనల నేపథ్యంలో ఈవీఎంలలో వేసిన ప్రతి ఓటును వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా ప్రింట్ అయిన పేపర్ స్లిప్‌‌లతో క్రాస్ చెక్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈవీఎంలతో పోలింగ్​పై ప్రజల్లో అనుమానాలు తలెత్తాయని చెప్పడంతోపాటు, బ్యాలెట్ ఓటింగ్ పద్ధతికి తిరిగి వెళ్లిన యూరోపియన్ దేశాలను ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే ఇక్కడ అంశాలు డిఫరెంట్​గా ఉన్నాయంటూ ఆ పోలికలను కోర్టు తోసిపుచ్చింది. 

ఈవీఎంలోని మైక్రోకంట్రోలర్‌‌ల గురించి, వాటిని రీ-ప్రోగ్రామ్ చేయవచ్చా? అని సుప్రీంకోర్టు ఈసీ నుంచి వివరణలు కోరింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కోరిన అంశాలపై ఈసీ సమగ్ర వివరాలతో ఒక టెక్నికల్ రిపోర్టును సమర్పించింది. ఈవీఎంలలోనిమూడు యూనిట్లు (బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్​) వేటికవే  సొంత మైక్రోకంట్రోలర్‌‌లు కలిగి ఉన్నాయని, వీటిని ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్ చేయవచ్చని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఈ మైక్రోకంట్రోలర్‌‌లు రీ-ప్రోగ్రామబుల్ ఫ్లాష్ మెమరీని కలిగి ఉన్నాయని ప్రశాంత్ భూషణ్ వాదించారు. 

అయితే ఈసీ సమర్పించిన టెక్నికల్ రిపోర్ట్​ను విశ్వసించాలని ఈ సందర్భంగా ఆయనకు కోర్టు సూచించింది. ఫ్లాష్ మెమరీ చాలా తక్కువగా ఉందని ఈసీ చెప్తున్నది.. ఈవీఎంలలో ఉపయోగించేది సాఫ్ట్‌‌వేర్ కాదు.. సీయూ (కంట్రోల్ యూనిట్)లోని మైక్రోకంట్రోలర్‌‌లకు సంబంధించినంతవరకు, ఇది అజ్ఞాతవాసి అని వారు చెప్పారు. ఇది పార్టీ లేదా గుర్తును గుర్తించదు. దానికి బటన్లు మాత్రమే తెలుసు" అని జస్టిస్ ఖన్నా అన్నారు. అనంతరం ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

ఎన్నికలను నియంత్రించే అధికారం మాకు లేదు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం(ఈసీ) పనితీరును నిర్దేశించలేం. ఈవీఎంలపై ఉన్న  డౌట్లన్నింటినీ ఈసీ క్లారిఫై చేసింది.  కేవలం అనుమానాన్ని బేస్ చేసుకొని ఆర్డర్లు ఇవ్వలేం. ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉండడంతో బ్యాలెట్ ఓటింగ్ పద్ధతికి తిరిగి వెళ్లిన యూరోపియన్ దేశాల్లోని అంశాలకు, మన దేశంలోని అంశాలకు చాలా తేడాలున్నాయి. దాన్ని మన విధానంతో పోల్చలేం. 

సుప్రీంకోర్టు