
- ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చనిపోతే..ఇన్సూరెన్స్ వర్తించదు:
- కర్నాటక యాక్సిడెంట్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చనిపోతే.. మృతుడి కుటుంబానికి ఇన్సూరెన్స్ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్.మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం ఓ కేసులో ఈ తీర్పు వెలువరించింది. కర్నాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో ఎన్ఎస్.రవీశ అనే వ్యక్తి.. స్పీడ్‌గా కారు నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయాడు.
ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నష్టపరిహారం కింద రూ.80 లక్షలు ఇప్పించాలని మృతుడి భార్య, కొడుకు, తల్లిదండ్రులు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారణ జరుపుతూ కీలక కామెంట్లు చేసింది. 2014, జూన్ 18వ తేదీన రవీశ.. తన భార్య, తండ్రి, సోదరుడు, పిల్లలతో కలిసి మల్లసంద్ర గ్రామం నుంచి అరిసకేరి టౌన్‌కు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది.
ఈ ప్రమాదంలో రవీశ చనిపోయాడు. కారును నిర్లక్ష్యంగా నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయాన్ని విచారణ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని, అందుకే ప్రమాదం జరిగిందని వివరించింది. కాగా, నష్టపరిహారం కోసం మృతుడి ఫ్యామిలీ తొలుత కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది.
రవీశ్.. ర్యాష్‌గా, నిర్లక్ష్యంగా కారు నడపడంతో యాక్సిడెంట్ జరిగిందని, ఈ కేసులో వారసులు ఎవరూ చట్టపరమైన పరిహారాన్ని కోరలేరని తీర్పు వెలువరించింది. దీంతో మృతుడి కుటుంబం సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం ధర్మాసనం కూడా కర్నాటక హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.