
- కేంద్రంలో ఏ పార్టీ పవర్లో ఉన్నా ఇదే తీరు
- సీఈసీ, ఈసీల అపాయిట్మెంట్కు ఒక మెకానిజం ఉండాలె
- అందులో సీజేఐకి చోటు కల్పించాలని అభిప్రాయం
- ఈసీగా గోయల్ నియామకం ఫైల్‌ను ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్రంలో ఏ పార్టీ పవర్ లో ఉన్నా అధికారాన్ని కాపాడుకోవాలనే చూస్తోందని.. అందుకే అన్నింట్లోనూ తమకు ‘యస్’ అంటూ తలూపే వ్యక్తులనే సీఈసీగా, ఈసీలుగా నియమిస్తోందంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థగా పని చేయాలంటే సీఈసీ, ఈసీల ఎంపికకు ఒక మెకానిజం ఉండాలని, అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా చోటు కల్పించాలని అభిప్రాయపడింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ), ఎలక్షన్ కమిషనర్ (ఈసీ)ల నియామకానికి కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్ లపై బుధవారం సుప్రీంకోర్టు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్ తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగించింది.
ప్రధానిపై చర్యలు తీస్కోగలరా?
కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. దినేశ్ గోస్వామి కమిటీ సిఫార్సుల మేరకు పార్లమెంట్ ఈసీ యాక్ట్ 1991ను ఆమోదించిందని, అందువల్ల ఈసీలు, సీఈసీ నియామక ప్రక్రియ సరిగ్గాలేదన్న వాదనకు తావు లేదన్నారు. ఈసీ చట్టం ప్రకారం ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థగానే కొనసాగుతోందని, ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. ఎన్నికల కమిషనర్లలో సీనియర్ నే సీఈసీగా నియమించడం, కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో సెక్రటరీ లేదా చీఫ్ సెక్రటరీ స్థాయిలో పని చేసిన అధికారులనే ఎన్నికల కమిషనర్లుగా అపాయింట్ చేయడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ‘‘సీనియర్ బ్యూరోక్రాట్ల పేర్లతో లిస్ట్ తయారు చేస్తారు. ఆ లిస్ట్ ను న్యాయ శాఖకు పంపుతారు. అక్కడి నుంచి లిస్ట్ ప్రధానికి ఫార్వర్డ్ అవుతుంది. ప్రధాని ఎంపిక చేసే వ్యక్తులను రాష్ట్రపతి ఈసీలు, సీఈసీగా నియమిస్తారు” అని వివరించారు. అయితే, ఏజీ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ‘‘కేంద్ర ప్రభుత్వం తాము చెప్పినదానికల్లా యస్ చెప్పే వ్యక్తినే సీఈసీగా నియమించిందనుకోండి. అతను స్వతంత్రంగా పని చేస్తారని చెప్పలేం. ఒకవేళ ప్రధానిపై ఫిర్యాదులు వస్తే.. ఆయన ద్వారా నియమితులైన సీఈసీ చర్యలు తీసుకోగలరా?” అని బెంచ్ ప్రశ్నించింది.
72 ఏండ్లుగా ఎందుకు చట్టం చేయలే?
ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లో ఎలాంటి ప్రక్రియను పేర్కొనలేదని, కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు దీనిని అవకాశంగా తీసుకుంటున్నాయని మంగళవారం కోర్టు కామెంట్ చేసింది. ఎన్నికల సంఘం నియామక ప్రక్రియ కోసం పార్లమెంటు 72 ఏండ్లుగా చట్టాన్ని తేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 2004 నుంచి పదేండ్ల పాటు యూపీఏ హయాంలో ఆరుగురు సీఈసీలు పూర్తికాలం పదవిలో కొనసాగకుండానే దిగిపోయారని, ఆ తర్వాత ఎన్డీఏ ఎనిమిదేండ్ల పాలనలోనూ ఎనిమిది మంది సీఈసీలు కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదని గుర్తు చేసింది. అందుకే.. 1990 నుంచి 96 వరకూ సీఈసీగా పని చేసి, ఎన్నో రిఫార్మ్స్ తెచ్చిన టీఎన్ శేషన్ లాంటి వ్యక్తులు సీఈసీలుగా నియమితులు కావాలన్నదే తమ అభిప్రాయమని చెప్పింది.
గోయల్ నియామకపు ఫైల్ ఇవ్వండి
కొత్త ఎలక్షన్ కమిషనర్ అరుణ్‌గోయల్ నియామకానికి సంబంధించిన ఫైల్ ను గురువారం కల్లా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవలే ఐఏఎస్ గా రిటైర్ అయిన ఆయనను ఈసీగా నియమించడం వెనక అవకతవకలు ఏమైనా జరిగాయా? లేదా? అన్నది తెలుసుకోవాలని అనుకుటుంన్నట్లు బెంచ్ స్పష్టం చేసింది. కోర్టులో విచారణ జరుగుతుండగానే అరుణ్ గోయల్‌ను ఈసీగా ఎందుకు అపాయింట్ చేయాల్సి వచ్చిందో తెలియాలని పేర్కొంది. అరుణ్ గోయల్ వీఆర్ఎస్ తీసుకున్న మరుస టి రోజే ఈసీగా నియమితులయ్యార ని, తనకు తెలిసినంతవరకూ వీఆర్ఎస్ ప్రక్రియ పూర్తయ్యేందుకు మూడు నెలలు పడుతుందని బెంచ్‌కు అధ్యక్షత వహించిన జస్టిస్ జోసెఫ్ కామెంట్ చేశారు.