
న్యూఢిల్లీ: దేశ రక్షణ కోసం తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న వీర జవాన్లకు రక్షణేదీ అంటూ ఇద్దరు ఆర్మీ అధికారుల కుమార్తెలు సుప్రీం కోర్టు గడప తొక్కారు. కశ్మీర్ లోని సైనికులకు రక్షణ కల్పించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా పాలసీ రూపొందించారని పిటిషన్ దాఖలు చేశారు. పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు అమరులైన నేపథ్యంలో ఈ పిటిషన్ కు ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్రానికి నోటీసులు
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. సోమవారం ఉదయం విచారణ చేపట్టింది. పిటిషనర్ల వాదన విన్న కోర్టు.. జమ్ము కశ్మీర్, కేంద్ర ప్రభుత్వాలకు, రక్షణ శాఖ, జాతీయ మానవ హక్కుల కమిషన్ లకు నోటీసులు జారీ చేసింది. దీనిపై అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.
జవాన్లకు మానవ హక్కులు లేవా?
19ఏళ్ల ప్రీతి కేదార్ గోఖలే, కాజల్ మిశ్రా (20) ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ‘‘ఉగ్ర సంస్థలు, ముష్కరులు దాడులు చేస్తూ సైనికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఆ జవాన్లకు మానవ హక్కులు ఉండవా? వారి మానవ హక్కులను కాపాడేలా పాలసీ రూపొందించండి’’ అని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంను అడిగారు. కేంద్ర, జమ్ము కశ్మీర్ ప్రభుత్వాలతో పాటు రక్షణ శాఖ, జాతీయ మానవ హక్కుల కమిషన్ లను ప్రతివాదులుగా చేర్చారు. జవాన్ల మానవ హక్కుల గురించి ఎవరూ పట్టించుకోకపోవడంపై అసంతృప్తితో ఈ పిటిషన్ వేశామని ప్రీతి, కాజల్ చెప్పారు. దీని వల్ల సైనికులు తమ విధులు సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారని, వారికి రక్షణ కూడా కరువవుతోందని అన్నారు.