ముస్లిం మహిళలకు భరణం

ముస్లిం మహిళలకు భరణం
  • మతంతో ఎలాంటి సంబంధం లేదంటూ చరిత్రాత్మక తీర్పు
  • భరణం అనేది చారిటీ కాదని బెంచ్ కామెంట్
  • భార్యల త్యాగాలను భర్తలు గుర్తించాలని హితవు
  • మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలని సూచన

న్యూఢిల్లీ: ముస్లిం మహిళ విడాకులు తీసుకుంటే మాజీ భర్త నుంచి భరణం పొందొచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. సీఆర్ పీసీ 125 సెక్షన్ మతంతో సంబంధం లేకుండా ప్రతి మహిళకూ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. విడాకులు తీసుకున్న భార్యకు.. 125 సీఆర్‌‌పీసీ ప్రకారం భరణం చెల్లించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్‌‌ జార్జ్‌‌ మాసిహ్‌‌తో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. తీర్పు వెలువరిస్తూ పలు కీలక కామెంట్లు చేసింది. 

చట్టప్రకారం భరణానికి అర్హురాలే..

‘‘విడాకులు తీసుకున్న మహిళ తన మాజీ భర్త నుంచి భరణం కోరవచ్చు. సీఆర్​పీసీలోని సెక్షన్ 125 అనేది.. భరణానికి సంబంధించిందే. మతంతో సంబంధంలేకుండా మహిళలు అందరికీ ఈ సెక్షన్ వర్తిస్తుంది. హోంమేకర్​గా మహిళ త్యాగాన్ని భర్త గుర్తించాలి. ఇంట్లో ఆమె పోషించే పాత్రను గౌరవించాలి. భార్య తనపై మానసికంగా, ఇతర రకాలుగా ఆధారపడి ఉంటుందనే వాస్తవాన్ని భర్తలు గుర్తించాల్సిన సమయం వచ్చింది’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది.

ఆర్థిక సాధికారత కల్పించాలి

ఇంటిని చక్కదిద్దుకుంటూ (హోంమేకర్) ఎలాంటి ఉపాధి, ఆదాయ వనరు లేని భార్యకు ఆర్థిక సాధికారత కల్పించాల్సిన బాధ్యత భర్తదేనని సుప్రీం బెంచ్ అభిప్రాయపడింది. ప్రత్యేకించి ఆమె వ్యక్తిగత అవసరాల కోసం ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలని పేర్కొంది. ఈ ఆర్థిక సాయం అనేది ఆ కుటుంబంలో భార్యను మరింత సురక్షితంగా ఉంచుతుందని తెలిపింది.

జాయింట్ అకౌంట్, ఏటీఎం యాక్సెస్ కు భర్త అంగీకరించాలని చెప్పింది. భరణం అనేది.. తన భర్తపై ఆధారపడే భార్య ఒత్తిడి, ఇబ్బందులను తగ్గిస్తుందని తెలిపింది. ఫ్యామిలీ కోసం కొందరు మహిళలు తమ ఉద్యోగాలను త్యాగం చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిందని పేర్కొంది. భర్త, పిల్లలు, అత్త మామలను చూసుకోవడానికే మహిళలు తమ టైమ్ మొత్తం కేటాయిస్తున్నారని బెంచ్ తెలిపింది.

లింగ సమానత్వం ముఖ్యం

భరణం అనేది.. చారిటీ కాదని, పెండ్లైన మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు బెంచ్ నొక్కి చెప్పింది. దీనికి ఎలాంటి మతపరమైన అడ్డుగోడలు ఉండవని తెలిపింది. లింగ సమానత్వం, ఆర్థిక భద్రత సూత్రాన్ని బలపరుస్తుందని చెప్పింది. సీఆర్​సీపీలోని సెక్షన్ 125 అనేది.. ఓ వ్యక్తి తన భార్య, పిల్లలు లేదంటే పేరెంట్స్​కు భరణం ఇవ్వకుండా తిరస్కరించలేడనే విషయం చెప్తుందని వివరించింది. ఈమేరకు అబ్దుల్ సమద్ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టేసింది.

ఫ్యామిలీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా..

పర్సనల్ లాకు లోబడి తాము 2017లోనే విడాకులు తీసుకున్నామని, తన వద్ద డైవర్స్ సర్టిఫికెట్ కూడా ఉందని అబ్దుల్ సమద్ తెలంగాణ ఫ్యామిలీ కోర్టుకు తెలిపాడు. దీనికి అంగీకరించని ఫ్యామిలీ కోర్టు.. నెలకు రూ.20వేల భరణం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో సమద్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థిస్తూనే.. భరణాన్ని రూ.10వేలకు తగ్గిస్తూ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది.

దీనిపై సమద్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా అతనికి ఎదురుదెబ్బే తగిలింది. విడాకులు తీసుకున్న మహిళ తనను తాను పోషించుకునే స్థితిలో లేనట్లైతే సీఆర్​పీసీ సెక్షన్ 125 ప్రకారం.. ఆ మహిళ భర్త భరణం చెల్లించాల్సిందేనని సుప్రీం బెంచ్​ తేల్చి చెప్పింది. సమద్ పిటిషన్​ను కొట్టేస్తూ.. హైకోర్టు తీర్పును సమర్థించింది.

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నం: ఎన్​సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ

భరణం విషయంలో సుప్రీం కోర్టు చేసిన కామెంట్లను స్వాగతిస్తున్నామని ఎన్​సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ తెలిపారు. ‘‘మతంతో సంబంధం లేకుండా లింగ సమానత్వం, న్యాయం కోసం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. అన్ని వర్గాల మహిళలకు సెక్షన్ 125 ద్వారా న్యాయం జరుగుతుంది. చట్ట ప్రకారం.. ఏ మహిళ కూడా ఇతరులపై ఆధారపడకూడదనే అంశాన్ని బలపరు స్తుంది. ఎన్​సీడబ్ల్యూ కూడా మహిళల హక్కు కోసం పోరాడుతుంది’’అని శర్మ తెలిపారు.