రాజకీయాల కోసం కోర్టులను వాడుకుంటున్నరు : సుప్రీం కోర్టు

రాజకీయాల కోసం కోర్టులను వాడుకుంటున్నరు : సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను యుద్ధ క్షేత్రాలుగా వాడుకుంటున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.  ఏపీ, తెలంగాణ నుంచి వచ్చే కేసులు ఈ కోవకు చెందినవిగా ఉంటున్నాయని పేర్కొంది. మొయినాబాద్​ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో నిందితులకు రిమాండ్ విధిస్తూ  హైకోర్టు బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ నిందితులు రామచంద్ర భారతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సోమవారం జస్టిస్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం విచారించింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్  అడ్వకేట్  సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ... నిందితుల బెయిల్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతున్నదన్నారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వకేట్​ విశ్వనాథన్..  పార్టీ వేసిన పిటిషన్ కు, తమకు ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. పార్టీల ఆందోళనలను తాము కంట్రోల్ చేయలేమని నివేదించారు. నిందితుడి హక్కుల కోసమే హైకోర్టులో వాదనలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న బెంచ్​.. ‘‘కొన్ని సందర్భాల్లో ఏపీ, తెలంగాణ నుంచి వస్తున్న కేసుల్లో రాజకీయ వివాదాలతో ముడిపడి ఉంటున్నాయి. కోర్టులను రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధ క్షేత్రాలుగా మార్చుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.