బళ్లారిలో టెన్షన్.. టెన్షన్.. గాలి ఇంటి వద్ద కాల్పులు

బళ్లారిలో టెన్షన్.. టెన్షన్.. గాలి ఇంటి వద్ద కాల్పులు
  • చిచ్చుపెట్టిన ఫ్లెక్సీ వివాదం.. తమ ఇంటి వద్ద కట్టవద్దని అనడంతో ఘర్షణ 
  • గన్​మ్యాన్ ​తుపాకీ గుంజుకొని కాల్పులు జరిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్​రెడ్డి అనుచరుడు
  • ఒకరు మృతి, మరొకరికి సీరియస్

బళ్లారి: కర్నాటకలోని బళ్లారిలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం రాత్రి జరిగిన రాజకీయ ఘర్షణ ఈ కాల్పులకు దారితీసింది. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రంగా గాయపడ్డారు. జనవరి 3న నిర్వహించనున్న మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఫ్లెక్సీలు కట్టడం ఈ వివాదానికి దారితీసింది. గురువారం రాత్రి భరత్ రెడ్డి అనుచరులు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకు ఫ్లెక్సీ కట్టాలని ప్రయత్నించగా, గాలి వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడం, కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘర్షణ సందర్భంగా భరత్ రెడ్డి గన్‌‌మన్ నుంచి ఆయన సన్నిహితుడు సతీశ్ రెడ్డి తుపాకీ లాక్కొని కాల్పులు జరిపాడు. మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఘర్షణ మరింత పెరుగడంతో పోలీసులు వచ్చి లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

ఈ కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందాడు. కాల్పులు జరిపిన సతీశ్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో బెంగళూరుకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కాగా.. తన ఇంటి వద్ద ఘర్షణ, కాల్పులు తనపై హత్యాయత్నమేనని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. భరత్ రెడ్డి మాత్రం గాలి జనార్దన్​ రెడ్డే రెచ్చగొట్టాడని, ఆయన్ను చంపాల్సిన అవసరం లేదని చెప్పారు. వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠ శాంతియుతంగా చేయాలని చూస్తుంటే కావాలనే వారు ఘర్షణకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్​ కార్యకర్తల ఫిర్యాదుతో గాలి జనార్దన్​రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా 11 మందిపై బ్రూస్‌‌పేట స్టేషన్‌‌లో కేసు నమోదైంది.