నీళ్లు కాదు.. విషాన్ని సరఫరా చేస్తున్నారు..ప్రజారోగ్యాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం గాలికొదిలేసింది

నీళ్లు కాదు.. విషాన్ని సరఫరా చేస్తున్నారు..ప్రజారోగ్యాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం గాలికొదిలేసింది
  •     పరిశుభ్రమైన నీరు పొందే  ప్రజల హక్కును కాలరాసింది 
  •     బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నరు
  •     పేదలు మరణించినా మోదీజీ మాత్రం మౌనం వీడరని ఫైర్​:         రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ

న్యూఢిల్లీ: కలుషిత నీరు తాగి మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగరంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ స్పందించారు.  అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు నీరు కాదు.. విషాన్ని సరఫరా చేస్తున్నదని మండిపడ్డారు.

 ప్రజల ప్రాణాలు పోతున్నా కుంభకర్ణుడిలా సర్కారు నిద్రపోతున్నదని అన్నారు. భగీరత్‌‌‌‌‌‌‌‌పుర ప్రాంతంలో తాగునీటి పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో మురుగునీరు కలిసిపోవడం వల్ల డయేరియా వ్యాప్తి చెంది, కనీసం 10 మంది (ఒక 5-6 నెలల పసిపాపతో సహా) మరణించారు.  గత తొమ్మిది రోజుల్లో 1,400 మందికి పైగా వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. 272 మంది ఆసుపత్రిలో చేరారు, వీరిలో 32 మంది ఐసీయూలో ఉన్నారు. ఈ ఘటనపై శుక్రవారం రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీ ‘ఎక్స్​’ వేదికగా స్పందించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందని అన్నారు. ‘‘ఇండోర్ ప్రజలకు నీరు కాదు, విషం సరఫరా చేశారు. ఫిర్యాదులు వస్తున్నా యంత్రాంగం మొద్దు నిద్రపోయింది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమే. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ అని ప్రగల్భాలు పలికే మోదీ ప్రభుత్వం పేదలు చనిపోతుంటే ఎందుకు మౌనంగా ఉంది?”అని ఆయన ప్రశ్నించారు.
అధికారులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?

కలుషిత నీరు తాగడం వల్ల చాలా మంది ఇండ్లలో విషాదం నెలకొన్నదని రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ తెలిపారు. పేదలు నిస్సహాయ స్థితిలో ఉంటే బీజేపీ నేతలు నిర్లక్ష్యపు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు కనీసం ఓదార్చడం లేదని,  అహంకారంతో వ్యవహరిస్తున్నారని అన్నారు.

 అసలు తాగే నీటిలో మురుగునీరు ఎలా కలిసింది? అని అడిగారు. విషయం తెలియగానే నీటి సరఫరా ఎందుకు ఆపలేదు? అని ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? అని అడిగారు. పరిశుభ్రమైన నీరు పొందే ప్రజల హక్కును కూడా డబుల్​ ఇంజిన్​ బీజేపీ సర్కారు కాలరాస్తున్నదని  ఫైర్​ అయ్యారు.

ఇది సిగ్గుచేటు: ఖర్గే

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందిన ఇండోర్​లో కలుషిత నీటితో మరణాలు సంభవించడం సిగ్గుచేటని కాంగ్రెస్​ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ అసమర్థత వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని మండిపడ్డారు. 

“జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి ఎప్పుడూ ఊదరగొట్టే నరేంద్ర మోదీ.. ఇండోర్‌‌‌‌‌‌‌‌ మరణాలపై ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారు” అని ‘ఎక్స్’ వేదికగా విరుచుకుపడ్డారు. దశాబ్ద కాలంగా దేశానికి సుదీర్ఘ ప్రసంగాలు, అబద్ధాలు, మోసం, ఉత్తుత్తి వాగ్దానాలు మాత్రమే అందుతున్నాయన్నారు. 

దేశ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీటిని అందించడంలోనూ మోదీ ప్రభుత్వం విఫలమైందని శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది అన్నారు. కాగా, ఈ ఘటనను ఇండోర్ హైకోర్టు బెంచ్ తీవ్రంగా పరిగణించింది. బాధితులకు ఉచిత వైద్యం అందించాలని, సురక్షితమైన నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.