- 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
- ఇల్లీగల్ కంటెంట్ను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- గ్రోక్లో మహిళల మార్ఫింగ్ ఫొటోలపై ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆందోళన
- కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ
న్యూఢిల్లీ: ఆరంభంలోనే తిట్లు, అసభ్య పదాలతో హడలెత్తించి, రాజకీయ పక్షపాత సమాధానాలతో విస్మయపర్చిన గ్రోక్ ఏఐ చాట్ బాట్ ఇప్పుడు ఏకంగా మహిళల మార్ఫింగ్ ఫొటోలనూ క్రియేట్ చేస్తుండటంపై కేంద్రం సీరియస్ అయింది. గ్రోక్ ఏఐలో అశ్లీల, లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. చట్ట విరుద్ధమైన కంటెంట్ ను తొలగించకపోయినా, అలాంటి కంటెంట్ ను అనుమతించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ శుక్రవారం గ్రోక్ ఏఐ మాతృ సంస్థ ‘ఎక్స్’కు స్ట్రాంగ్ నోటీసు జారీ చేసింది.
ఈ విషయంలో తీసుకున్న చర్యల గురించి వివరిస్తూ 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఐటీ యాక్ట్, 2000, ఐటీ రూల్స్, 2021 నిబంధనలను పాటించడంలో ఎక్స్ నిర్లక్ష్యం వహించిందని కేంద్రం తేల్చిచెప్పింది. గ్రోక్ ఏఐని మహిళలను అశ్లీల, లైంగిక వేధింపులకు గురి చేసేలా దుర్వినియోగం చేస్తున్నారని, ఇలాంటి కంటెంట్ ను ఈ చాట్ బాట్ లో అనుమతించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చట్ట విరుద్ధమైన కంటెంట్ ను అనుమతించకుండా చూసుకోవాలని ఆదేశించింది.
కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ
నిబంధనలను ఉల్లంఘించే యూజర్లను టర్మినేట్ చేయాలని, కఠినమైన యూజర్ పాలసీలు అమలు చేయాలని ‘ఎక్స్’కు కేంద్రం స్పష్టం చేసింది. గ్రోక్ ఏఐ నిబంధనలను పాటించకపోతే ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 79, బీఎన్ఎస్, ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఏఐ ప్లాట్ ఫామ్స్ లో అశ్లీల కంటెంట్ కు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ఈ నోటీసు కాపీలను కీలక మంత్రిత్వ శాఖలు, కమిషన్లు, రాష్ట్రాల అధికారులకు కూడా కేంద్రం పంపింది. కాగా, కేంద్రం నోటీసు జారీకి ముందు ఈ అంశంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేదీ లేఖ రాశారు. ఎక్స్ కంపెనీకి చెందిన ఏఐ యాప్లలో మహిళల మార్ఫింగ్ ఫొటోలు క్రియేట్ అవుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
