పార్టీ ఆఫీస్​ను ఖాళీ చేయాల్సిందే .. ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీం కోర్టు ఆదేశం

పార్టీ ఆఫీస్​ను ఖాళీ చేయాల్సిందే .. ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. న్యూఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రాంతంలోని ఆప్ ప్రధాన కార్యాలయాన్ని జూన్ 15 లోగా ఖాళీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. లోక్ సభ ఎన్నికలు రానున్నందున గడువు ఎక్కువ ఇస్తున్నట్లు పేర్కొంది. ఆ జాగపై ఆప్​కు ఎలాంటి హక్కులు లేవని, పార్టీ ఆఫీస్ ఏర్పాటుకు మరోచోటు కేటాయించాలని ల్యాండ్స్ అండ్ డెవలప్​మెంట్ అథారిటీకి దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఆ అప్లికేషన్​ను ప్రాసెస్ చేసి, 4 వారాల్లోనే ఫలితం తేల్చాలని తాము అథారిటీని కోరుతామని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ తెలిపింది. ఢిల్లీ హైకోర్టు కోసం కేటాయించిన జాగలో ఆప్ తన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై గతంలో హైకోర్టు విచారించగా.. ప్రత్యామ్నాయ జాగ ఇస్తే 2 నెలల్లో ఆ స్థలాన్ని ఖాళీ చేస్తామని ఆప్ ప్రభుత్వం హమీ ఇచ్చింది. కానీ, ఆ వ్యవహారం ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టుకు వచ్చింది. హైకోర్టుకు చెందిన జాగను వెంటనే హైకోర్టుకే అప్పగించాలని ఆప్​ను ఆదేశించింది.