కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం

కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సీడబ్ల్యూసీ ఆమోదం పొందిన డిజైన్ మేరకే కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోలేకపోతున్న తెలంగాణ, ఎలాంటి అనుమతులు లేకుండా రూ.30 వేల కోట్లు అక్రమంగా ఖర్చు చేసి అదనపు టీఎంసీ పనులు చేస్తోందని, తద్వారా ఎందరినో నిర్వాసితులను చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పలువురు నిర్వాసితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​ను జస్టిస్ ఏఎం కన్వీల్కర్, జస్టిస్​ జేబీ పార్థీవాల బెంచ్ శుక్రవారం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతోపాటు నిర్వాసితులకు పరిహారం పంపిణీలోనూ వివక్ష చూపుతోందని పిటిషనర్ తరుఫు లాయర్​ వివరించారు. వాదనలు విన్న బెంచ్..​ కాళేశ్వరం విస్తరణ పనులపై కేంద్రంతోపాటు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.