కేఆర్ఎంబీ వద్ద 10 కోట్లు డిపాజిట్ చేయండి

కేఆర్ఎంబీ వద్ద 10 కోట్లు డిపాజిట్ చేయండి

న్యూఢిల్లీ, వెలుగు: డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల వ్యవహారంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన రూ.92 కోట్ల జరిమానాలో రూ.10 కోట్లు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) దగ్గర డిపాజిట్ చేయాలని తెలంగాణ సర్కార్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లో డబ్బును డిపాజిట్ చేయాలని సూచించింది. మిగతా ఫైన్​ వసూళ్లలో ఎలాంటి ఒత్తిడితో కూడిన చర్యలు చేపట్టవద్దని పేర్కొంది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండానే డిండి, పాలమూరు- – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​ పనులు చేపడుతున్నారంటూ ఏపీకి చెందిన చంద్రమౌళీశ్వర రెడ్డి, ఏపీ సర్కార్ విడివిడిగా ఎన్జీటీని ఆశ్రయించాయి. ఈ పిటిషన్ లపై విచారణ జరిపిన ఎన్జీటీ చెన్నై బెంచ్.. గతేడాది డిసెంబర్​లో తెలంగాణ సర్కార్​కు రూ.924.85 కోట్ల ఫైన్ వేసింది. ఇందులో డిండి ఎత్తిపోతలపై రూ.92.85 కోట్లు, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల స్కీమ్​పై రూ.532 కోట్లు, గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు రూ. 300 కోట్లు జరిమానా విధించింది. అయితే, ఎన్జీటీ వేసిన ఈ భారీ జరిమానాను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్​ను శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన బెంచ్​విచారించింది. 

మేము స్పందించే వరకు చూడొద్దు

ఈ కేసు వ్యవహారంలో బెంచ్​ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమస్యను మీరు పరిష్కరాస్తారా? లేక మమ్మల్ని చొరవ తీసుకోమంటారా? అని కేంద్ర ప్రభుత్వం తరపు అడ్వొకేట్​ను ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం గెడ్​లైన్స్​ను కోరతామని నివేదించారు. అయితే, మళ్లీ తాము స్పందించే వరకు వేచి చూడొద్దని బెంచ్​సూచించింది. కాగా, ఏపీ తరఫు అడ్వొకేట్​పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలపై వాదనలు కొనసాగిస్తుండగా.. తెలంగాణ తరఫు లాయర్లు అభ్యంతరం తెలిపారు. వేర్వేరు అంశాలను కలుపొద్దన్నారు. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్​లను ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలతో ముడి పెట్టడం సరికాదన్నారు. దీనిపై స్పందించిన బెంచ్.. పాలమూరు – రంగారెడ్డి విషయంలో స్టే ఉన్నందున, డిండి ఎత్తిపోతలపై దీనికి సంబంధం లేదన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న బెంచ్.. ​డిండి ప్రాజెక్టుకు విధించిన రూ.92 కోట్ల ఫైన్​లో రూ. పది కోట్లు కేఆర్ఎంబీ వద్ద జమ చేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఏవైనా సమస్యలుంటే నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్​కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పాలమూరు –- రంగారెడ్డి ఎత్తిపోతలలో తాగునీటి అవసరాలకు సంబంధించి 75 టీఎంసీల మేర పనులకు పర్మిషన్, ఎన్జీటీ విధించిన జరిమానాపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తమ వైఖరి తెలుపుతూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ కు వాయిదా వేస్తున్నట్లు బెంచ్​ వెల్లడించింది.