డిజిటల్ మోసగాళ్ల గుట్టు రట్టు చేయండి

డిజిటల్ మోసగాళ్ల గుట్టు రట్టు చేయండి

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారంనాడు డిజిటల్ అరెస్ట్ స్కాముల విషయంలో  కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సమగ్ర విచారణను ప్రారంభించాలని సంచలన తీర్పునిచ్చింది.  న్యాయమూర్తులు సూర్యకాంత్, జోయ్ మాల్యా బాగ్చీలతో  కూడిన ధర్మాసనం  దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ సైబర్  నేరాల మహమ్మారిని ఎదుర్కోవడానికి నిర్దిష్ట ఆదేశాలను జారీ చేసింది.  ఆమికస్  క్యూరీ  ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ స్కాములు, పెట్టుబడి మోసాలు, పార్ట్-టైమ్ ఉద్యోగాల మోసాలు మూడు రకాల సైబర్  నేరాలను  న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.  

ఈ సైబర్  నేరాలు  బాధితులను బెదిరించి డబ్బు దోచుకునే ప్రయత్నాలు చేస్తాయని లేదా మోసగించడానికి ముందు పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేయమని వారిని ఆకర్షిస్తాయని కోర్టు గుర్తించింది.  ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ స్కాముల విచారణకు సీబీఐ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, డిజిటల్ అరెస్ట్ స్కాములను సీబీఐ తక్షణం విచారణ జరపాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాన్ని జారీ చేసింది.

డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరగాళ్లు సృష్టించిన ఒక మోసపూరిత పద్ధతి.  ఇది చట్టబద్ధమైన అరెస్టు కాదు.  బాధితులను ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా సంప్రదించి, వారి పేరు ఏదో ఒక నేరంలో ఇరుక్కుందని నమ్మిస్తారు. ఆ తర్వాత  బాధితులు  నేరంలో  దోషులుగా తేలకుండా ఉండాలంటే  లేదా  జైలుకు వెళ్లకుండా ఉండాలంటే,  డబ్బు డిపాజిట్ చేయాలని బెదిరిస్తారు లేదా నిర్బంధిస్తారు.  ఈ మొత్తం ప్రక్రియ అంతా ఆన్‌‌లైన్‌‌లో, బాధితుడిని వీడియో కాల్‌‌లో ఉంచి,  బయటి ప్రపంచంతో  మాట్లాడకుండా నియంత్రించడం ద్వారా జరుగుతుంది.  

దీనినే 'డిజిటల్ అరెస్ట్' అని పిలుస్తారు.  ‘డిజిటల్ అరెస్ట్’ అనేది నేరగాళ్లు కల్పించిన మోస పూరిత పద్ధతి. ఈ పద్ధతిలో మోసగాళ్లు తమను తాము  సీబీఐ,  నార్కోటిక్స్,  ఈడీ  లేదా  ఇతర  పోలీసు విభాగాల ఉన్నతాధికారులుగా పరిచయం చేసుకుంటారు.  బాధితులు మనీ లాండరింగ్,  డ్రగ్స్ స్మగ్లింగ్  లేదా ఇతర తీవ్రమైన నేరాలలో ఇరుక్కున్నారని అరెస్టు చేస్తామని  జైలుకు పంపుతామని బెదిరిస్తారు.  ఈ  భయంతో బాధితులు బయటి ప్రపంచంతో మాట్లాడకుండా పూర్తిగా తమ నియంత్రణలో ఉండేలా చూసుకుంటారు. తరచుగా వీడియో కాల్‌‌లోనే ఉంచి, దీనిని 'సేఫ్ హౌస్' లేదా 'డిజిటల్ కస్టడీ'గా వ్యవహరిస్తారు. 

నేరం నుంచి బయటపడటానికి, 'క్లియరెన్స్ అకౌంట్' పేరుతో భారీ మొత్తంలో డబ్బును తమ ఖాతాల్లో డిపాజిట్ చేయమని బలవంతం చేస్తారు. ఈ మోసాలను సీబీఐ తక్షణ ప్రాధాన్యతతో విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వృద్ధులే లక్ష్యంగా మోసాలు

న్యాయస్థానం గత అక్టోబర్‌‌లో ఈ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సుమోటో కేసును ప్రారంభించింది. ఒక వృద్ధ దంపతులు మోసగాళ్ల చేతిలో రూ.1.5 కోట్లు కోల్పోయిన విషయాన్ని లేఖ రూపంలో సుప్రీంకోర్టుకు రాశారు. ఆ మోసగాళ్లు ఫోన్, వీడియో కాన్ఫరెన్స్‌‌ల ద్వారా వారిని సంప్రదించి, అరెస్ట్ చేస్తామని బెదిరించి,  నకిలీ సుప్రీంకోర్టు ఆదేశాలను చూపించి డబ్బు వసూలు చేశారు. అంబాలాలోని సైబర్ క్రైమ్ బ్రాంచ్‌‌లో నమోదైన రెండు ఎఫ్‌‌ఐఆర్‌‌లు వృద్ధులను లక్ష్యంగా చేసుకునే ఈ నేరాల వ్యవస్థీకృత విధానాన్ని బహిర్గతం చేశాయి. న్యాయస్థానం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోగానే  అనేకమంది బాధితులు ముందుకు రావడం, వేర్వేరు రాష్ట్రాల్లో ఎఫ్‌‌ఐఆర్‌‌లు నమోదు కావడం ఈ నేరాల విస్తృతిని, తీవ్రతను తెలియజేస్తోంది.  

రాష్ట్రాలన్నీ ఈ మోసాలలో ఎక్కువగా వృద్ధులనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఏకగ్రీవంగా వెల్లడించాయి. వృద్ధులు లక్ష్యంగా ఉన్నప్పుడు అటువంటి కేసులను ప్రాధాన్యతతో  విచారించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.  సైబర్ మోసాల ద్వారా ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ స్కాముల ద్వారా దాదాపు రూ. 3,000 కోట్లు ప్రజల నుంచి దోచుకున్నారనే వార్తలకు న్యాయస్థానం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

సీబీఐ విచారణ బలోపేతానికి ఆదేశాలు

సుప్రీంకోర్టు ముఖ్యమైన ఆదేశాల ప్రకారం  సీబీఐ దర్యాప్తు కోసం తమ తమ రాష్ట్రాల్లో సమ్మతి ఇవ్వని రాష్ట్రాలు వెంటనే సమ్మతిని మంజూరు చేయాలి.  తద్వారా  సీబీఐ  సమగ్ర దర్యాప్తును చేపట్టగలదు. డిజిటల్ అరెస్ట్ స్కాముల ప్రయోజనం కోసం బ్యాంక్ ఖాతాలు తెరిచిన చోట, అవినీతి నిరోధక చట్టం కింద బ్యాంకర్ల పాత్రను విచారించడానికి సీబీఐకి స్వేచ్ఛను కోర్టు ఇచ్చింది.  అనుమానాస్పద  ఖాతాలను  గుర్తించడానికి,  నేరం ద్వారా వచ్చిన డబ్బును స్తంభింపజేయడానికి ఏఐ లేదా మెషిన్ లెర్నింగ్ ను అమలు చేయవచ్చా అనే విషయంపై ఈ కోర్టుకు సహాయం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్  ఇండియాను  ఆదేశించింది.  విచారణ సమయంలో  అవసరమైనప్పుడు  సీబీఐకి సహకరించాలని 2021 నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియట్​ నిబంధనల కింద ఉన్న అధికారులను ఆదేశించింది. 

అవసరమైనప్పుడు అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్​పోల్​ సహాయాన్ని కోరాలని సీబీఐని ఆదేశించింది.  ఒకే పేరుపై  సిమ్ కార్డులు లేదా బహుళ సిమ్‌‌లు జారీ చేయడంలో టెలికాం సేవా నిర్లక్ష్యపూరిత  వైఖరి వెల్లడైతే, అటువంటి దుర్వినియోగాన్ని నివారించడానికి ఒక ప్రతిపాదనను కోర్టుకు సమర్పించాలని డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ టెలికాంను ఆదేశించింది.  రాష్ట్రాలు త్వరితగతిన రాష్ట్ర సైబర్ క్రైమ్ కేంద్రాలను స్థాపించాలి.  ఈ ఆదేశాలతో సుప్రీంకోర్టు డిజిటల్ మోసాల సమస్యను జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా నిర్ణయించింది.  పౌరుల భద్రతను బలపరచాలని న్యాయపీఠం స్పష్టంగా ఆదేశించింది. ఈ విచారణ డిజిటల్ నేరాల సామ్రాజ్యాన్ని కూల్చివేస్తుందని, పౌరులకు న్యాయం చేకూరుస్తుందని ఆశిద్దాం.

- డా. కట్కూరి 
సైబర్ సెక్యూరిటీ & న్యాయ నిపుణుడు