ఢిల్లీలో అన్ని బారికేడ్లను తొలగించండి అవసరమైతే తప్ప ఎక్కడా ఉంచొద్దు..

ఢిల్లీలో అన్ని బారికేడ్లను తొలగించండి అవసరమైతే తప్ప ఎక్కడా ఉంచొద్దు..
  • శాంతియుతంగా గుమిగూడినోళ్లను నిర్బంధించొద్దు
  • మెట్రో స్టేషన్ల మూసివేతపై  బెంచ్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • సుప్రీంకోర్టు పరిసరాల్లో సెక్షన్ 163 
  • నిబంధనలను ఎత్తివేయాలని ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • లాయర్ల విధులకు ఆటంకం కలిగించొద్దని వార్నింగ్‌‌‌‌‌‌‌‌
  • ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా
  • షరతుపై సీజేపీ నేతల విడుదల..లోకల్‌‌‌‌‌‌‌‌ కోర్టు బెయిల్​ 

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను స్తంభింపజేయడం, మెట్రో స్టేషన్లను మూసివేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రజల రాకపోకలను అడ్డుకునేలా ఏర్పాటు చేసిన బారికేడ్లను అత్యవసరమైన చోట్ల తప్ప మిగితావన్నీ వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. ఢిల్లీ మెట్రో స్టేషన్ల మూసివేతను సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ 
జోయ్‌‌‌‌‌‌‌‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన ధర్మాసనం ప్రత్యేక విచారణ చేపట్టింది. 
 

సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుమిగూడటాన్ని నిషేధిస్తూ బీఎన్‌‌ఎస్ఎస్‌‌-2023 లోని సెక్షన్ 163 కింద జారీ చేసిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయస్థానాలకు ప్రజలు, న్యాయవాదులు స్వేచ్ఛగా చేరుకునే హక్కుకు ఎలాంటి విఘాతం కలగకూడదని తేల్చిచెప్పింది. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ప్రజల రాకపోకలను స్తంభింపజేయడం సరికాదని వ్యాఖ్యానించింది. చట్టప్రకారం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయకుండా కొనసాగించాలని, ట్రాఫిక్ నిబంధనలకు లోబడి ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించవద్దని పేర్కొన్నది. 

న్యాయస్థాన ఆదేశాల ధిక్కరణపై నోటీసులు

అక్టోబర్ 10న జరిగిన ఆందోళనల సందర్భంగా రైళ్లు, మెట్రో సేవలను పూర్తిగా నిలిపివేయవద్దని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మెట్రో స్టేషన్లను మూసివేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పిటిషనర్ శైలేంద్ర మణి త్రిపాఠి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సొలిసిటర్‌‌‌‌ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, శనివారం రాత్రి 10 గంటలకే మెట్రో స్టేషన్లన్నీ తెరిచామని, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించామని తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌‌‌‌సీ)లకు నోటీసులు జారీ చేసింది.

నిర్బంధాలు, తీసుకున్న చర్యలపై మంగళవారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని, అయితే ఆ నిరసన ప్రక్రియ పోలీస్ చట్టం పరిధిలోనే ఉండాలని బెంచ్‌‌ వ్యాఖ్యానించింది. పోలీస్ చట్టాన్ని అతిక్రమించి ఆందోళనలు చేయలేరని పిటిషనర్‌‌కు స్పష్టం చేసింది. అదే సమయంలో విధులకు హాజరవుతున్న న్యాయవాదులను అడ్డుకోవద్దని పోలీసులను హెచ్చరించింది.  అయితే, బారికేడ్ల ఏర్పాటుపై సమీక్ష జరపాలని, ఏయే మెట్రో స్టేషన్లను మూసివేశారో మ్యాప్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.  పోలీసుల అత్యుత్సాహం, అక్రమ నిర్బంధాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్న బెంచ్.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

 సీజేపీ నేతల విడుదల 

 సర్‌‌ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ సీఈసీ జ్ఞానేశ్‌‌ కుమార్‌‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శనివారం విమానం దిగగానే అదుపులోకి తీసుకున్న వీరిని, ఆదివారం ఉదయం ముందస్తు అరెస్టు కింద ఢిల్లీ కంటోన్మెంట్‌‌లోని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రాబోయే ఏడాది కాలం పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకూ పాల్పడవద్దన్న షరతుపై కోర్టు వారిని విడుదల చేసింది.