
టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు ( Mohan Babu ), ఆయన కుమారుడు మంచు విష్ణు ( Manchu Vishnu )కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2019లో నమోదైన ఒక కేసులో వారిపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ను సుప్రీంకోర్టు ( Supreme Court ) గురువారం రద్దు చేసింది. ఈ కేసు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. ఎన్నికల నియమావళి ( Model Code of Conduct ) ని ఉల్లంఘించి, నిరసన ర్యాలీ నిర్వహించారనే ఆరోపణలపై కేసు నమోదైంది.
సుప్రీంకోర్టు కీలక తీర్పు
జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసును లోతుగా పరిశీలించింది. కేసును కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. మోహన్ బాబు, మంచు విష్ణుపై ఉన్న ఆరోపణలు నిలబడతగినవి కావని పేర్కొంటూ, వారిపై నమోదైన కేసును కొట్టివేసింది. దీంతో మోహన్ బాబు కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఈ న్యాయపోరాటం ముగిసింది.
అసలేం జరిగింది?
2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఛైర్మన్ అయిన మోహన్ బాబు, అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో శ్రీ విద్యానికేతన్‌లోని సిబ్బంది, విద్యార్థులతో కలిసి మోహన్ బాబు ఆయన కుమారులు విష్ణు, మనోజ్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని తిరుపతి-మదనపల్లి రోడ్డుపై చేపట్టారు. దీంతో నాలుగు గంటల పాటు భారీగా ట్రాఫిక్ అయింది. దీంతో వారిపై కేసు నమోదు చేశారు.
ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం, ఈ ర్యాలీ ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరిగింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ, రోడ్డుపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించి, ప్రజలకు అసౌకర్యం కలిగించారని ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించామని, దీని వెనుక మోహన్ బాబు, మంచు విష్ణు ప్రమేయం స్పష్టంగా ఉందని ప్రాసిక్యూషన్ వాదించింది.
అయితే మోహన్ బాబు, విష్ణు తరపు న్యాయవాదులు దీనిపై మరో వాదన వినిపించారు. విద్యార్థులకు నిధులు విడుదల చేయాలని అప్పటి ప్రభుత్వానికి పలుసార్లు విజ్ఞప్తులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే తాము శాంతియుతంగా నిరసన తెలిపామని వారు పేర్కొన్నారు. అలాగే, తాము ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వలేదని, కాబట్టి తమకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించదని వారు వాదించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో మోహన్ బాబు కుటుంబానికి ఊరట లభించింది.