భోజ్​శాలలో తవ్వకాలు ఆపండి..కేంద్రానికి,యూపీకి సుప్రీం నోటీసులు

భోజ్​శాలలో తవ్వకాలు ఆపండి..కేంద్రానికి,యూపీకి  సుప్రీం నోటీసులు
  •     కేంద్ర ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్ సర్కార్​కు సుప్రీం నోటీసులు
  •     నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

న్యూఢిల్లీ :  మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని పురాతన కట్టడం భోజ్​శాల కాంప్లెక్స్​లో సైంటిఫిక్ సర్వేకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. అక్కడ ఎలాంటి తవ్వకాలు చేపట్టొద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ను ఆదేశించింది. ప్రస్తుతం భోజ్​శాలలో ఏఎస్ఐ చేస్తున్న సర్వే రిపోర్టుపై తమ అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. భోజ్​శాల తమదంటే.. తమది అని అటు హిందువులు, ఇటు ముస్లింలు వాదిస్తున్నారు. భోజ్‌‌శాల కట్టడంలో ఏఎస్‌‌ఐ సర్వే చేపట్టాలని మార్చి 11న మధ్యప్రదేశ్‌‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌‌ చేస్తూ అక్కడ మసీదును నిర్వహిస్తున్న మౌలానా కమాలుద్దీన్‌‌ వెల్ఫేర్‌‌ సొసైటీ సుప్రీంకోర్టుకు వెళ్లింది.
 

ఈ పిటిషన్‌‌ను సోమవారం జస్టిస్ రుషికేశ్ రాయ్, జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్‌‌ సర్కార్, ఏఎస్​ఐతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పటి దాకా సర్వే రిపోర్టుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూనే.. తవ్వకాలు చేపట్టొద్దని సూచించింది. కాగా, భోజ్​శాల 11వ శతాబ్దానికి చెందిందని, వాగ్దేవి దేవి (సరస్వతి దేవి) ఇక్కడే కొలువుదీరిందని హిందువులు అంటున్నారు. భోజ్​శాలకు హిందువులకు ఎలాంటి సంబంధం లేదని, ఇది కమల్ మౌలా మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. ఏఎస్ఐ ప్రకారం.. 2003, ఏప్రిల్ 7 నుంచి ప్రతీ మంగళవారం హిందువులు భోజ్​శాల ఆవరణలో పూజలు చేస్తుంటే.. ముస్లింలు ప్రతీ శుక్రవారం నమాజ్ చేస్తున్నారు.