హిండెన్ బర్గ్ – అదానీ వివాదంలో కేంద్రానికి సుప్రీం షాక్

హిండెన్ బర్గ్ – అదానీ వివాదంలో కేంద్రానికి సుప్రీం షాక్

హిండెన్ బర్గ్ అదానీ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. కేంద్రం సూచించిన నిపుణుల కమిటీని ధర్మాసనం తిరస్కరించింది. సీల్డ్ కవర్లో పేర్లు అందజేయడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం ఈ అంశంలో పూర్తి పారదర్శకత కోరుకుంటున్నట్లు చెప్పింది. ఒకవేళ సీల్డ్ కవర్ను కోర్టు అంగీకరిస్తే ప్రభుత్వం నియమించిన కమిటీకి ఓకే చెప్పినట్లు అవుతుందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. తాము అలా జరగాలని కోరుకోవడం లేదన్న ఆయన.. అదానీ ఇష్యూలో తామే కమిటీ వేస్తామని స్పష్టం చేశారు. కమిటీలో సభ్యులుగా ఎవరుండాలో జడ్జీలే ఫైనల్ చేస్తారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు చెప్పారు. మరోవైపు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కాకుండా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తామని సీజే ధర్మాసనం ప్రకటించింది.  

హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ స్టాక్ పతనం అనంతరం ఇన్వెస్టర్ల సంపదను రక్షించేందుకు పటిష్ట యంత్రాంగం అవసరమని సుప్రీంకోర్టు సూచించింది. దీనికి సంబంంధించి జడ్జి నేతృత్వంలో ఎక్స్ పర్ట్ కమిటీ సభ్యుల పేర్లు సూచించాలని గతవారం కోర్టు కేంద్రానికి చెప్పింది. ఈ క్రమంలోనే సెబీని మరింత పటిష్ఠం చేసేందుకు ప్యానెల్ ఏర్పాటుకు కేంద్రం రెడీ అయింది. అయితే కమిటీ ప్రతిపాదనలను సీల్డ్ కవర్ లో అందించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం సొంతంగా ప్యానెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.