మీ యాడ్స్ ​సైజులోనే క్షమాపణ ప్రకటన ఇవ్వండి

మీ యాడ్స్ ​సైజులోనే క్షమాపణ ప్రకటన ఇవ్వండి
  • మీ యాడ్స్​సైజులోనే క్షమాపణ ప్రకటన ఇవ్వండి
  • తప్పుడు ప్రకటనల కేసులో పతంజలికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: పతంజలి ఆయుర్వేద తప్పుడు ప్రకటనల కేసులో బాబా రాందేవ్​, బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘న్యూస్​ పేపర్లలో ఇచ్చిన క్షమాపణ ప్రకటనను మీ కంపెనీ యాడ్స్​ సైజులో ఇచ్చారా?’  అని ప్రశ్నించింది. కోర్టు ఎదుట తాజా క్షమాపణ ప్రకటనలు ఉంచినట్టు పతంజలి తరఫున హాజరైన సీనియర్​ అడ్వొకేట్​ ముకుల్​ రోహిత్గీ మంగళవారం కోర్టుకు తెలిపారు. క్షమాపణల ప్రకటనలను నిన్ననే ఎందుకు ఇచ్చారని, ఇంతకుముందు ఎందుకు చెప్పలేదని ధర్మాసనం ప్రశ్నించింది. రూ.10 లక్షలు ఖర్చుపెట్టి 67 న్యూస్​ పేపర్లలో ఈ ప్రకటన ఇచ్చినట్టు రోహిత్గీ కోర్టుకు తెలిపారు. ‘మీ క్షమాపణ ప్రకటన ప్రముఖంగా ప్రకటన ఇచ్చారా? ఇంతకుముందు మీ కంపెనీ యాడ్​ సైజులో ఉందా? అని జస్టిస్​ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ఇందుకోసం ఎన్ని లక్షలు ఖర్చుపెట్టినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. అలాగే, పతంజలికి వ్యతిరేకంగా కేసు పెట్టినందుకు ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ (ఐఎంఏ)కు రూ. 1000 కోట్ల ఫైన్​ వెయ్యాలని దాఖలైన అప్లికేషన్​ను స్వీకరించినట్టు కోర్టు తెలిపింది. ‘ఇది కుట్రపూరిత అభ్యర్థన కాదా? మేం దీన్ని అనుమానిస్తున్నాం’ అని కోర్టు పేర్కొన్నది. అయితే, ఈ అప్లికేషన్​తో బాబా రాందేవ్​కుగానీ, బాలకృష్ణకుగానీ ఎలాంటి సంబంధం లేదని రోహిత్గీ తెలిపారు. అనంతరం న్యూస్​పేపర్లలో పెద్ద సైజులో క్షమాపణ ప్రకటన ఇస్తామని బాబా రాందేవ్​ చెప్పడంతో కోర్టు విచారణను వారానికి వాయిదా వేసింది.  

ప్రింట్​ కాపీలను సమర్పించండి

క్షమాపణ యాడ్స్​ సైజును కొలిచేందుకు ప్రింట్​ అయిన కాపీలను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం పతంజలి తరఫు న్యాయవాదిని ఆదేశించింది. యాడ్స్​ను కట్​చేసి తమకివ్వాలని పేర్కొన్నది. ఆ యాడ్స్​కు సంబంధించిన అసలు సైజును తాము చూడాలని అనుకుంటున్నామని, ఇది తమ ఆదేశమని పేర్కొన్నది. ప్రకటనలు భూతద్దంలో పెట్టి చూసేలా ఉండొద్దని, ఆ యాడ్స్​చదివే రీతిలో ఉండాలని జస్టిస్​ హిమా కోహ్లీ తెలిపారు.