-
అక్టోబర్ 1 వరకు చేపట్టొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా అలాంటి కూల్చివేతలను వెంటనే ఆపాలని ఆదేశాలిచ్చింది. ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నేరస్తుల ఇండ్లను, ప్రైవేట్ ఆస్తులను నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లతో కూల్చివేస్తుండడంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. వీటిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.
ఈ సందర్భంగా బెంచ్ స్పందిస్తూ.. ‘‘ఒక్క నిర్మాణాన్ని అక్రమంగా కూల్చివేసినా, అది రాజ్యాంగానికి వ్యతిరేకం. అక్టోబర్ 1 వరకు కోర్టు అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా కూల్చివేతలు చేపట్టొద్దు. నేరస్తుల ఇండ్లను కూడా కూల్చొద్దు” అని ఆదేశించింది. ఈ ఆదేశాలు పబ్లిక్ ప్లేసుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలకు మాత్రం వర్తించవని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది. కాగా, బుల్డోజర్ కూల్చివేతలంటూ పిటిషనర్లు ఓ కట్టుకథను సృష్టించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ సర్కార్ తరఫున వాదిస్తూ.. అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చామని, అదీ నోటీసులు ఇచ్చిన
తర్వాతే కూల్చివేతలు చేపట్టామని తెలిపారు.