6 నెలలు ఆగాల్సిన అవసరం లేదు..విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

6 నెలలు ఆగాల్సిన అవసరం లేదు..విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. విడాకుల ప్రక్రియను సులభతరం చేస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోవాలి అనుకుంటే విడాకుల కోసం 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కొన్ని షరతులతో ఆరునెలల నిరీక్షణ నిబంధనలను సడలించిన సుప్రీంకోర్టు..దంపతులు కోరుకుంటే వెంటనే విడాకుల మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

దంపతుల వివాహబంధం విచ్ఛిన్నమైతే ...కోర్టు విడాకులు మంజూరు చేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.  ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు విడాకులను మంజూరు చేయొచ్చని తెలిపింది. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలి అనుకుంటే అందుకోసం ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదని..కొన్ని షరతులతో ఈ తప్పనిసరి నిరీక్షణ గడువును ఎత్తివేయొచ్చని జస్టిస్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్. ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరి సభ్యులతో కూడిన ధర్మాసంన తీర్పు వెలువరించింది. 

విడాకుల అంశాన్ని కుటుంబ న్యాయస్థానాలకు రిఫర్ చేయకుండానే సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేయాలంటూ పలు పిటీషన్లు దాఖలయ్యాయి. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే వారి విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిలోని ప్రత్యేక అధికారాలను వినియోగిచుకునే వీలుందా అనే దానిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఐదేళ్ల క్రితం 2016 జూన్ 29న ఈ పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. కొన్నాళ్ల పాటు విచారించిన బెంచ్..2022 సెప్టెంబర్ లో తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా  మే 1వ తేదీన తీర్పు వెలువరించింది.