కౌంటర్ ఎందుకు దాఖలు చేయలే? ..ఉమ్మడి ఆస్తుల విభజన కేసులో కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్

 కౌంటర్ ఎందుకు దాఖలు చేయలే? ..ఉమ్మడి ఆస్తుల విభజన కేసులో కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజన కేసులో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గత విచారణ సమయంలో నాలుగు వారాలు గడువు ఇచ్చినా కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. రూ.1.42 లక్షల కోట్ల ఆస్తుల విభజనపై ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన బెంచ్​ విచారణ జరిపింది. ఉమ్మడి ఆస్తుల విభజన వ్యవహారంలో మీడియేషన్ కోసం ఇటీవల రిటైర్​అయిన జస్టిస్ రామసుబ్రమణియన్​ను నియమించాలని ఏపీ తరపు అడ్వొకేట్ ఎం నజ్కీ బెంచ్​కు విజ్ఞప్తి చేశారు. 

అయితే, ఈ వాదనపై తెలంగాణ తరపు సీనియర్ అడ్వొకేట్ సీఎస్ వైద్యనాథన్, స్టాండింగ్ కౌన్సిల్ శ్రీహర్ష పీచర అభ్యంతరం తెలిపారు. ఆస్తుల విభజన వ్యవహారంలో కేంద్రం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని, ఆ కౌంటర్ లోని అంశాలను పరిశీలించిన తర్వాత తమ వాదనలు వినిపిస్తామని నివేదించారు. ఇరువైపుల వాదనలు విన్న బెంచ్​ కేంద్రం కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి సారిగా మూడు వారాల టైం ఇచ్చింది. ఈ సారి కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అలాగే, దీనిపై కౌంటర్ రిజాయిండర్ల దాఖలుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు మరో మూడు వారాల గడువు ఇస్తున్నట్లు బెంచ్ వెల్లడించింది.