హైదరాబాద్: హైదరాబాద్‌లోని KBR పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేబీఆర్ పార్క్‌కు 35 మీటర్ల పరిధిలో చెట్లను నరకవద్దని ప్రభుత్వానికి సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేసింది. KBR పార్క్ చుట్టూ ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు స్టేతో ఈ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అదే కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించతలపెట్టిన ‘గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్’. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర ప్రగతిని బ్యాలెన్స్ చేస్తూ, ‘గ్రీన్ హైదరాబాద్’ లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్‌కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ‘జీరో పార్క్ ఇంట్రూజన్’ విధానం ద్వారా పార్క్ భూములను ఏ మాత్రం తాకకుండా, కేవలం ప్రస్తుతం ఉన్న రోడ్డు మీడియన్లలోనే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించనున్నట్టు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ కోసం కేబీఆర్ పార్క్‌లోని ఒక్క చెట్టును నరకబోమని స్పష్టం చేశారు. కేవలం సెంట్రల్ మీడియన్‌లో ఉన్న చెట్లను మాత్రమే అధునాతన ‘ట్రాన్స్‌ప్లాంటేషన్’ పద్ధతి ద్వారా సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలించనున్నట్లు పేర్కొన్నారు.
