
- అరెస్టేంది? విడిచిపెట్టండి
- యూపీ పోలీసులకు సుప్రీం కోర్టు ఆదేశం
- ‘యోగిపై పోస్ట్’ కేసులో జర్నలిస్ట్ కనోజియాకు బెయిల్
- జడ్జిలకూ సోషల్ మీడియా సెగ తప్పడం లేదన్న బెంచ్
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడన్న కేసులో నోయిడా జర్నలిస్ట్ ప్రశాంత్ కనౌజియాను తక్షణమే విడిచిపెట్టాలని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు ఏ రూల్స్ ప్రకారం జర్నలిస్టును అరెస్టు చేశారంటూ యూపీ పోలీసులపై కోర్టు మండిపడింది. కనౌజియా భార్య జగీశా అరోరా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగీతో కూడిన వెకెషన్ బెంచ్ మంగళవారం విచారించింది. అరెస్టును తప్పుపట్టిన జడ్జిలు, జర్నలిస్టుకు బెయిల్ మంజూరు చేశారు. యూపీ సర్కార్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీ, పిటిషనర్ తరఫున నిత్యా రామకృష్ణ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా, రాజ్యాంగం పౌరులకు కల్పించిన వాక్‌స్వాతంత్ర్యపు హక్కు చాలా పవిత్రమైనదని, దాని విషయంలో ఎలాంటి రాజీ ఉండదని జడ్జిలు స్పష్టం చేశారు.
ఆ పోస్టుల్ని సమర్థించం కానీ..
జర్నలిస్ట్ కనౌజియాకు బెయిల్ ఇచ్చినంత మాత్రాన సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టుల్ని కోర్టు సమర్థిస్తున్నట్లుగా భావించొద్దని బెంచ్ పేర్కొంది. ‘‘మంచికో, చెడుకో జడ్జిలకు కూడా కొన్ని సార్లు సోషల్ మీడియా సెగ తప్పట్లేదు. అలాంటి సందర్భాల్లో నిబంధనల ప్రకారం మన పని మనం చేసుకుపోవడం మంచింది. పౌరహక్కులపై స్పష్టమైన చట్టాలున్నాయి. ఒకరి స్వేచ్ఛా హక్కును హరించే అధికారం ఎవరికీ లేదు. దాన్ని కోర్టు కూడా అంగీకరించదు. ఆర్టికల్ 32 ప్రకారం(నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ) దాఖలైన పిటిషన్ విషయంలోనైనాసరే, స్వేచ్ఛా హక్కుకు భంగం వాటిల్లుతుంటే మేం చేతులు ముడుచుకొని కూర్చోలేం. ఈ కేసులో నిందితుణ్ని(కనౌజియాని) జ్యూడీషియల్ కస్టడీ పేరుతో 11 రోజులు జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు. యూపీ పోలీసులు దర్యాప్తు కొనసాగించొచ్చు. కానీ అంతకంటే ముందు జర్నలిస్టును రిలీజ్ చేయాలి”అని జడ్జిలు పేర్కొన్నారు.
సీఎం యోగిది మూర్ఖత్వం: రాహుల్
జర్నలిస్టుల విషయం యూపీ సీఎం ఆదిత్యనాథ్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు. తప్పుడు వార్తలు, వ్యతిరేక ప్రచారం చేశారన్న అభియోగాలపై మీడియా ప్రతినిధుల్ని అరెస్టు చేయడం సరికాదన్నారు. ‘‘అలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ సపోర్టుతో నాపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాసే వాళ్లందర్నీ అరెస్టు చేసి జైళ్లలో పెడితే దేశంలో జర్నలిస్టుల కొరత ఏర్పడుతుంది”అని రాహుల్ ట్వీట్ చేశారు. సమస్యల్ని పట్టించుకోని యోగిసర్కార్ జర్నలిస్టుల్ని బెదిరించే పనిలో బిజీ అయిపోయిందని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.
అసలేం జరిగింది?
ఇటీవల ఓ మహిళ.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పెండ్లి ప్రపోజల్ పంపానంటూ ఆయన ఇంటిముందే నిలబడి మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను నోయిడాకు చెందిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనౌజియా ట్విటర్, ఫేస్బుక్లో షేర్ చేశారు. నేషనల్ లైవ్ అనే న్యూస్ చానెల్ కూడా సదరు వీడియోను టెలికాస్ట్ చేసింది. సీఎం పరువుకు భంగంకల్గించేలా జర్నలిస్టులు వ్యవహరించారన్న బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు వేర్వేరుగా కేసులు నమోదు చేసిన యూపీ పోలీసులు శనివారం కనౌజియా, చానెల్ యజమాని ఇషికా సింగ్, ఎడిటర్ అనుజ్ శుక్లాలను అరెస్టు చేశారు. దీనిపై మీడియా సంఘాలు, ఎడిటర్స్ గిల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కర్నాటక సీఎంపై వీడియో.. ఇద్దరి అరెస్ట్
స్వేచ్ఛా హక్కు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సందర్భంలో కర్నాటకలో ఇద్దరి అరెస్టు వ్యవహారం సంచలనంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఓటమిపై సిద్దరాజు, చామరాజు అనే ఇద్దరు యువకులు సెటైర్లతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. అందులో సీఎం కుమారస్వామి, ఆయన కొడుకు నిఖిల్‌పై అభ్యంతరకర కామెంట్స్ ఉన్నాయని జేడీఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇద్దరు యువకుల్ని శనివారం పోలీసులు అరెస్టు చేసి 15 రోజుల రిమాండ్‌కు తరలించారు. యూపీ సీఎంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ కామెంట్స్‌ని కోట్ చేస్తూ బీజేపీ.. కర్నాటక సీఎంను టార్గెట్ చేసింది. ‘‘కుమారస్వామి అన్నా, యాంటీ కామెంట్స్ చేసినంత మాత్రాన పౌరుల్ని అరెస్టు చేయడం మూర్ఖత్వమని మీ ఫ్రెండ్ రాహుల్ గాంధీ చెప్పారు. కర్నాటకలో సర్కార్ కూలిపోతుందన్న భయంతో ఆయన మీ పేరు చెప్పలేదు. దయచేసి మీ ఫ్రెండ్ మాటలు ఆలకించండి’’అంటూ బీజేపీ సెటైర్ వేసింది. సీఎం కుమారస్వామి ఓపెన్‌గా జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారని, టిప్పు సుల్తాన్‌పై మాట్లాడినందుకు సంతోశ్ తమ్మయ్య అనే జర్నలిస్టును, నిఖిల్ గౌడపై ఆర్టికల్ రాసినందుకు విశ్వేశ్వర భట్ అనే మరో విలేకరిపై కర్నాటక సర్కార్ కేసులు పెట్టిందని బీజేపీ గుర్తుచేసింది.