కేజ్రీవాల్​కు బెయిల్ ఎందుకివ్వొద్దు .. ఈడీకి సుప్రీంకోర్టు ప్రశ్న

కేజ్రీవాల్​కు బెయిల్ ఎందుకివ్వొద్దు .. ఈడీకి సుప్రీంకోర్టు ప్రశ్న

న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో మళ్లీ నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్ పిటిషన్​పై వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం.. తీర్పును రిజర్వ్​లో పెట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కన్వీనర్ కావడంతో లోక్​సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం విచారించిన ధర్మాసనం కీలక కామెంట్లు చేసింది. కేజ్రీవాల్‌‌‌‌ ఢిల్లీకి ప్రజలు ఎన్నుకున్న సీఎం అని, నేరాలకు అలవాటు పడిన వ్యక్తి కాదని తెలిపింది. లోక్‌‌‌‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వొద్దని ఈడీ తరఫు అడ్వకేట్​ను ప్రశ్నించింది.

చట్టం ముందు అందరూ సమానమే: ఈడీ

ధర్మాసనం కామెంట్లపై ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్​కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టుకు విన్నవించారు. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. సీఎం అయినంత మాత్రాన స్పెషల్​గా ట్రీట్ చేయొద్దని విన్నవించారు.

ఫైళ్లపై సంతకాలు చేస్తే ఒప్పుకోమన్న కోర్టు

‘బెయిల్ మంజూరు చేస్తే మీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతిస్తాం. అధికారిక విధులు నిర్వహించేందుకు మాత్రం ఒప్పుకోం. బెయిల్​పై బయటికెళ్లాక సీఎంగా విధులు నిర్వర్తించొద్దు. ఎలాంటి ఫైళ్లపై సంతకాలు పెట్టొద్దు. అలా చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం’’ అని కేజ్రీవాల్​కు సుప్రీం కోర్టు సూచించింది.