- సీజేఐ బెంచ్ ముందు మెన్షన్ చేసిన ముకుల్ రోహిత్గి
- బుధవారం విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టు అనర్హత ఆదేశాల నేపథ్యంలో బైఎలక్షన్ నోటిఫికేషన్‌పై ఆందోళనగా ఉందని దానం నాగేందర్ తరఫు సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన దానం నాగేందర్.. 2024 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ ఫామ్‌పై బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశాయి.
దీనిపై సుప్రీం ఆదేశాలతో విచారణ జరిపిన స్పీకర్.. దానం చట్టపరంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని మార్చి 11 న తీర్పు వెలువరించారు. ఈ తీర్పును బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు సీజే బెంచ్.. దానంపై అనర్హత వేటు వేయడంతో పాటు, ఈ విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని పక్కన పెట్టింది.
అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. దానం నాగేందర్ ఈ నెల 19న సుప్రీకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. మరోవైపు ఈ పిటిషన్‌పై మహేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి కేవియట్‌లు దాఖలు చేశారు. కాగా.. ఈ అనర్హత పిటిషన్‌పై విచారణ జరపాలని దానం తరఫు ముకుల్ రోహిత్గి సోమవారం సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు.
పార్టీతో సంబంధం లేని వ్యక్తి పిటిషన్‌వేశారు
సీజేఐ బెంచ్ ముందు ముకుల్ రోహిత్గి వాదన వినిపిస్తూ.. ‘రేపటి విచారణ జాబితాలో అత్యవసరంగా విచారించాలని కోరుతున్నాను. గత శుక్రవారం తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్ ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. దానం తన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. కానీ.. పార్టీతో సంబంధం లేని వ్యక్తి(బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్) ఈ పిటిషన్ వేశారు’ అని కోర్టుకు నివేదించారు.
దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ఇది అనర్హత పిటిషన్‌నా? లేదా ఎలక్షన్ పిటిషన్‌నా? అని ప్రశ్నించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరఫు అడ్వకేట్ మహేశ్ జఠ్మలాని స్పందిస్తూ.. బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. అన్ని వైపుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సీజేఐ ధర్మాసనం... బుధవారం ఈ పిటిషన్ పై వాదనలు వింటామని స్పష్టం చేసింది
