- సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అలహాబాద్ హైకోర్టు తీర్పు రద్దు
న్యూఢిల్లీ: యూపీ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్–2004 రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ మంగళవారం తీర్పు వెలువరించింది. యూపీ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ లౌకికవాద భావనకు విరుద్ధంగా ఉందని అలహాబాద్ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీం.. మదర్సాలు రాజ్యాంగబద్ధమేనని పేర్కొంటూ కీలక తీర్పు ఇచ్చింది. మదర్సాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు నిబంధనలు రాష్ట్ర సర్కార్ అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. చట్టంలో మతపరమైన శిక్షణకు సంబంధించిన అంశాలు ఉన్నంత మాత్రాన రాజ్యాంగవిరుద్ధం కాదని పేర్కొంది. మైనార్టీల హక్కులను కాపాడేలా, ప్రస్తుత చట్టం ఉందని స్పష్టం చేసింది.