
ఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామకంపై సర్వోన్నత న్యాయస్థానం ఇవ్వాల కీలక ఆదేశాలు వెలువరించింది. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీ సిఫారసుల మేరకు భారత రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమిస్తారని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ప్రతిపక్ష నేత లేకపోతే లోక్‌సభలో విపక్ష మెజార్టీ పార్టీ ఎంపీని కమిటీలో సభ్యుడిగా చేర్చాలని సూచించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాలకూ కొలీజియం తరహా వ్యవస్థ ఉండాలంటూ దాఖలైన పిటిషన్లపై ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు గత నవంబరులో ప్రకటించింది.