- బీఆర్ఎస్ నేతల పిటిషన్లను విచారించనున్న ధర్మాసనం
న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జనవరి 15న సుప్రీంకోర్టును బీఆర్‌ఎస్ పార్టీ ఆశ్రయించింది.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్పీ) దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకెపూడి గాంధీపై కేటీఆర్, హరీశ్ రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
పాడి కౌశిక్, వివేకానంద్‌ల పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా.. ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎంత సమయం కావాలో చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అసెంబ్లీ సెక్రటరీని కోరింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. అలాగే, గత వారం ఏడుగురు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ బెంచ్ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపులపై దాఖలైన రెండు పిటిషన్లను కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా.. నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేతల పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ జరపనుంది.
