లాక్ డౌన్ లో వడ్డీ సంగతి తేల్చండి

లాక్ డౌన్ లో వడ్డీ సంగతి తేల్చండి

కేంద్రానికి సుప్రీం ఆదేశం
అఫిడవిట్‌ ఎందుకు ఇవ్వలేదని ఫైర్
వడ్డీ మాఫీకి అధికారాలు ఉన్నాయని స్పష్టీకరణ
తదుపరి విచారణ వచ్చే నెల ఒకటికి వాయిదా

న్యూఢిల్లీ: బ్యాంకు లోన్ల చెల్లింపుపై మారటోరియం ఎంచుకున్న వారి నుంచి వడ్డీ వసూలు చేయాలా ? వద్దా ? అనే విషయమై గడువులోపు అఫిడవిట్ ఎందుకు అందజేయలేదంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌(డీఏఎం) ప్రకారం ఇలాంటి ఆపద సమయంలో బ్యాంకు వడ్డీలను మాఫీ చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని స్పష్టం చేసింది. అయినప్పటికీ తప్పించుకుంటున్నారని విమర్శించింది. ఈ విషయంలో మీ వైఖరి ఏమిటో పేర్కొంటూ అఫిడవిట్‌ ఇవ్వాలని కోర్టు గతంలోనూ ఆదేశించినా కేంద్రం నుంచి రెస్పాన్స్ రాలేదు. కరోనా కారణంగా జాబ్స్ ‌పోగొట్టుకున్న వారిని, ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకోవడానికి మారటోరియం ఇవ్వాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించి న సంగతి తెలిసిందే. దీంతో లక్షలాది మంది మారటోరియానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే మూడు నుంచి ఆరు నెలలపాటు మారటోరియానికి ఒప్పుకున్న బ్యాంకులు, ఈ కాలానికి తదనంతరం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేశాయి. దీనిపై సుప్రీంకోర్టులో
పిటిషన్‌ దాఖలయింది.

విచారణ సందర్భంగా జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ మాట్లాడుతూ అఫిడవిట్లు ఆలస్యం కావడం వల్లే విచారణ పూర్తి కావడం లేదని విమర్శించారు. ‘‘లాక్‌డౌన్‌ సమస్య మీరు సృష్టించినదే! కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐ వెనుక దాక్కోవాలని చూస్తోంది. ఇటువంటి సమయంలో
వ్యాపార ధోరణితో ఆలోచించవద్దు. ప్రజలకు ఉపశమనం కలిగించాలి. వారి దుస్థితిని లెక్కలోకి తీసుకోవాలి’’ అని కామెంట్‌ చేశారు. డీఏఎం చట్టం ప్రకారం.. ఆపద సమయంలో బారోవర్ల నుంచి వడ్డీ వసూలు చేయొద్దని, ఈఎంఐల చెల్లింపులను వాయిదా వేయాలని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉంటుందని సుప్రీంకోర్టు బెంచ్‌ స్పష్టం చేసింది.

వారం గడువు ఇవ్వండి..
కేసు విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్ ‌తుషార్‌ మెహతా స్పందిస్తూ కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకుంటోందని, నెపాన్ని ఆర్‌బీఐపైకి నెట్టేస్తోందన్న విమర్శలు సరికాదని వాదించారు. మారటోరియం వడ్డీపై ఏం చేయాలనే విషయమై ప్రభుత్వం, ఆర్‌బీఐతో కలసి పనిచేస్తోందని వివరణ ఇచ్చారు. అఫిడవిట్‌ కోసం వారం గడువు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఇందుకు బెంచ్‌ స్పందిస్తూ వడ్డీ వసూలుపై ఈ నెల 31లోపు అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల ఒకటిన నిర్వహిస్తామని ప్రకటించింది. టర్మ్‌లోన్లకు మారటోరియం స్కీమ్ అమలును సమీక్షించాలని ఈ ఏడాది జూన్ 17న సుప్రీంకోర్టు కేంద్రాన్ని, ఆర్‌బీఐని ఆదేశించింది. వ్యవసాయం సహా వివిధ సెక్టార్ల‌కు తగ్గట్టుగా స్కీములను తయారు చేయాలని సూచించింది. మారటోరియాన్నిమరో మూడు నెలలపాటు పొడగిస్తున్నట్టు ఆర్‌బీఐ ఈ ఏడాది మే 22వ తేదీన ప్రకటించింది. అంతకు ముందు కూడా మూడు నెలలపాటు వెహికల్‌, అగ్రికల్చర్‌, హోమ్‌, పర్సనల్‌ లోన్లపై మారటోరియం ఇచ్చిన విషయం తెలిసిందే. క్రెడిట్‌కార్డుల పేమెంట్లకూ ఇదే రూల్‌ వర్తిస్తుందని ప్రకటించింది. మారటోరియంపై వడ్డీ వసూలు వల్ల కస్టమర్‌ నష్టపోతాడని గజేంద్ర శర్మ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. జనం ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారని, వారిపై వడ్డీభారం మోపడం సరికాదని వాదించారు. వడ్డీ వసూలు చేస్తే బారోవర్‌ అదనంగా మరో ఈఐఎం కట్టాల్సి వస్తుందని వివరించారు. ఇలా చేస్తే ఇక బ్యాంకు సాయం చేసినట్టుఎలా అవుతుందని ప్రశ్నిస్తూ.. డబ్బు లేక ఇబ్బందిపడుతున్న వారిని ఆదుకోవాలన్నారు.