
హైదరాబాద్, వెలుగు: పదేండ్లలో కేవలం కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందని, రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమూ అభివృద్ధి చెందలేదని సీడబ్ల్యూసీ మెంబర్ సుప్రియా శ్రీనటే అన్నారు. సీఎం, మంత్రి పదవులు అన్ని వాళ్ల ఇంట్లో వాళ్లకే ఇచ్చుకున్నారని విమర్శించారు. శుక్రవారం ఆమె కాంగ్రెస్ నేత గిరిజ షెట్కార్తో కలిసి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాలు వస్తాయని, రైతులు బాగుపడతారని, మహిళలు ఆర్థికంగా ఎదుగుతారని తెలంగాణ ఇస్తే.. వాళ్ల రాత ఇప్పటికీ మారలేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో 96 శాతం హామీలను నెరవేర్చామన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఫైరయ్యారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, ఉచిత ఎరువులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వంటి హామీలనూ అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా ఒక్క స్కూల్ కట్టలేదన్నారు. సీఎం పదవి ఇస్తానని దళితులనూ కేసీఆర్ మోసం చేశారన్నారు.
గ్యారంటీలను అమలు చేస్తం
కర్నాటకలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన వెంటనే ఐదు గ్యారంటీలను అమలు చేశామని, ఇక్కడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని సుప్రియ చెప్పారు. పిల్లల ఫీజులు కట్టలేక పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఇంటర్నేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీకి బీఆర్ఎస్, ఎంఐఎంలు బీ టీమ్లుగా పనిచేస్తున్నాయన్నారు. అన్ని చట్టాలు, బిల్లులకు బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచ్చిందని గుర్తు చేశారు.