- తెలంగాణ వచ్చినంక తట్ట మట్టి కూడా పోయలే?
- నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం
- వరంగల్ జడ్పీ చైర్‌పర్సన్ ను నిలదీసిన గ్రామస్తులు
శాయంపేట, వెలుగు : రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తమ గ్రామంలో అభివృద్ధి జరిగినట్లు చూపిస్తే ముక్కు నేలకు రాస్తామని హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని సూరంపేట గ్రామస్తులు వరంగల్ జడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతిని నిలదీశారు. గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన పల్లె ప్రగతి సమావేశానికి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి జడ్పీ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నల్లాల ద్వారా నీళ్లు రావడం లేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించలేదని, సీసీ రోడ్డు వేయలేదని గ్రామస్తులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉమ్మడి ఏపీలోనే తమ గ్రామంలో అభివృద్ధి జరిగిందని, తెలంగాణ వచ్చాక తట్టెడు మట్టి కూడా పోయలేదన్నారు. మిల్లర్లు క్వింటాల్‌కు పదికిలోల చొప్పున తరుగు తీస్తుంటే ఏం చేశారని అడిగారు.
అప్పుడు ఇప్పుడు మా హయాంలోనే..
2009లో ఎమ్మెల్యే గండ్ర హయాంలోనే అభివృద్ధి జరిగిందని, మళ్లీ 2018లో తమ హయాంలోనే డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయని జడ్పీ చైర్‌పర్సన్ జ్యోతి సమాధానమిచ్చారు. మధ్యలో ఎవరు గ్రామంలో అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. కావాలని విమర్శించేవాళ్లకు సమా ధానం చెప్పలేమన్నారు. అభివృద్ధి అంతా ఒకేసారి చేయాలంటే ఎలా సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదని అనేవాళ్లు తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాళ్లన్నారు. మేం చేసేంది చెప్పినం.. చేయబోయేది చెప్పేందుకే ఇక్కడికచ్చినం అన్నారు. నచ్చిన వారు వింటారు, నచ్చని వారు వాళ్ల పని వాళ్లు చేసుకుంటారన్నారు. తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని పలువురిని పక్కకి తీసుకెళ్లడంతో ఆమె మీటింగ్ ముగించుకుని వెళ్లిపోయారు.
