
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, డాషింగ్ లెఫ్టాండర్ సురేష్ రైనా ఇంటర్నేషనల్ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పంద్రాగస్టు రోజున తొలుత ధోని రిటైర్మెంట్ ప్రకటించగా, అనూహ్యంగా కొద్ది సేపటికే రైనా కూడా వీడ్కోలు చెప్పాడు. దీంతో పెద్ద తల, చిన్న తల ఫ్యాన్స్‌తోపాటు క్రికెట్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. తాజాగా తన రిటైర్మెంట్ సీక్రెట్‌ను రైనా రివీల్ చేశాడు. ఎంఎస్ ధోని రిటైరవుతాడనే విషయం తనకు ముందే తెలుసునన్నాడు. చెన్నైలో ల్యాండ్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఇస్తాడని తెలుసన్నాడు.
‘చెన్నైకి చేరుకోగానే ధోని రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని నాకు తెలుసు. నేను సిద్ధంగా ఉన్నా. పీయూష్ చావ్లా, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ 14న రాంచీకి చార్టెడ్ ఫ్లయిట్‌లో చేరుకున్నారు. ధోనీతోపాటు మోనూ సింగ్‌ను అక్కడి నుంచి పికప్ చేసుకున్నారు. మా రిటైర్మెంట్ ప్రకటించాక మేం ఒకర్నొకరం కౌగిలించుకున్నాం. చాలా ఏడ్చాం కూడా. ఆ తర్వాత మాతో చావ్లా, రాయుడు, కేదార్ జాదవ్, కర్ణ్ కూర్చున్నారు. మా కెరీర్, సంబంధాల గురించి మాట్లాడాం. ఆ రాత్రి మేం విందు చేసుకున్నాం. శనివారం రిటైర్ అవ్వాలనే మేం ముందే నిర్ణయించుకున్నాం. ధోని జెర్సీ నెంబర్ 7. నా జెర్సీ సంఖ్య 3. రెండింటినీ కలిపితే 73. పంద్రాగస్టు రోజున ఇండియా 73 సంవత్సరాల ఇండిపెండెంట్స్‌ను పూర్తి చేసుకుంది. దీని కంటే మంచి రోజు ఉంటుందా, ధోని తన కెరీర్‌ను డిసెంబర్ 23, 2004లో మొదలెట్టాడు. నేను 30 జూలై 2005లో కెరీర్‌ను ఆరంభించా. ఇంటర్నేషనల్ క్రికెట్‌ను దాదాపుగా మేం కలసి మొదలు పెట్టాం. అలాగే, సీఎస్‌కేకు కలసి ఆడాం. ఇప్పుడు కలసే రిటైరయ్యాం. ఐపీఎల్‌లో కలసే ఆడబోతున్నాం’ అని రైనా పేర్కొన్నాడు.