అబుదాబి టీ10 లీగ్లో ఆడనున్న రైనా

అబుదాబి టీ10 లీగ్లో ఆడనున్న రైనా

టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న అబుదాబి టీ10 లీగ్‌లో రైనా ఆడనున్నాడు. డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ టీమ్ తరఫున రైనా ఆడేందుకు ఆ ఫ్రాంచైజ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున దుమ్మురేపిన సురేష్ రైనా..ఇక అబుదాబి టీ10 లీగ్లో రెచ్చిపోనున్నాడు. 

 

రోడ్ సేఫ్టీ సిరీస్లో రాణించిన రైనా
ఐపీఎల్లో సురేష్ రైనా స్పెషల్ ప్లేయర్. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన అతను..ఒంటిచేత్తో మ్యాచులను గెలిపించాడు. అయితే  ఐపీఎల్‌ 2021 తర్వాత రైనాను సీఎస్కే రిటేన్ చేసుకోలేదు. ఇక ఐపీఎల్ 2022 మెగా వేలంలో రైనాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. దీంతో నిరాశకు గురైన రైనా ఇటీవలే ఐపీఎల్కు సైతం గుడ్‌బై చెప్పేశాడు. ఆ తర్వాత  భారత్‌లో జరిగిన రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్‌ తరఫున ఆడాడు. ఈ సిరీస్లో పర్వాలేదనిపించాడు. 

రైనా కెరీర్...
భారత జట్టు తరపున మొత్తం 226 వన్డేలు ఆడిన రైనా...5615 రన్స్ చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 36 అర్థసెంచరీలున్నాయి. బౌలింగ్లో 36 వికెట్లు పడగొట్టాడు. 18 టెస్టుల్లో 768 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు..7 అర్థసెంచరీలున్నాయి. 78 టీ20లు ఆడిన రైనా 1605 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 అర్థసెంచరీలు సాధించాడు. టీమిండియా తరపున 2018లో చివరి సారిగా వన్డే ఆడిన రైనా...మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మొట్ట మొదటి టీమిండియా క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.