సూర్యకుమార్ యాదవ్..టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడు

సూర్యకుమార్ యాదవ్..టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడు

టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్  టీ20 క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. ప్రతీ మ్యాచ్లో రాణిస్తూ...భారత జట్టుకు కీలక ప్లేయర్గా మారుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లోనూ సూర్యకుమార్ అదరగొట్టాడు. ఫస్ట్ మ్యాచ్లో 46 పరుగులు చేసిన సూర్య..రెండో మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. అయితే కీలకమైన మూడో మ్యాచ్లో ఏకంగా 69 పరుగులు చేసి టీమ్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇదే క్రమంలో ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. 

ఒకే ఒక్కడు..


2022లో ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ 20 మ్యాచ్లు ఆడాడు.  37.88 సగటుతో 682 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా..నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 117.  2022లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఒక్క ఇండియన్ క్రికెటర్ కూడా లేకపోవడం గమనార్హం. సూర్య తర్వాత నేపాల్ ప్లేయర్ దీపేందర్ సింగ్ 18 మ్యాచుల్లో 626 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. చెక్ రిపబ్లిక్ ప్లేయర్ సబావున్ దావిజి 15 మ్యాచుల్లో 612 పరుగులు సాధించాడు. ఇక పాక్ క్రికెటర్ రిజ్వాన్ 11 మ్యాచుల్లో 556 పరుగులతో నాల్గో ప్లేస్లో కొనసాగుతున్నాడు. విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ 15 మ్యాచుల్లో 553 రన్స్ చేసి ఈ జాబితాలో ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. 

విండీస్ సిరీస్తో స్టార్ట్..


సూర్యకుమార్ యాదవ్..ఈ ఏడాది ఫిబ్రవరిలో విండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల  సిరీస్ ద్వారా  ఈ ఏడాదిని టీ20 క్రికెట్ను ప్రారంభించాడు. అయితే గాయం కారణంగా ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్కు దూరమయ్యాడు. ఐపీఎల్లో ఆడినా..చివరల్లో గాయం కారణంగా సౌతాఫ్రికా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. గాయం నుంచి కోలుకుని..ఐర్లాండ్పై పునరాగమనం చేశాడు. అనంతరం ఇంగ్లాండ్తో నాటింగ్ హమ్లో జరిగిన టీ20 మ్యాచ్లో ఏకంగా సెంచరీతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లోనే 117 పరుగులు సాధించాడు. అనంతరం విండీస్తో జరిగిన టీ20 సిరీస్లో ఓపెనర్గా దిగి..76 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆసియాకప్లో హాంకాంగ్పై 26 బంతుల్లోనే 68 పరుగులు కొట్టాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు. తాజాగా ఆసీస్ సిరీస్లో రాణించాడు. 

2021లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ ద్వారా టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్..కేవలం 18 నెలల్లోనే జట్టులో కీలక ప్లేయర్గా ఎదిగాడు. త్వరలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో..ఈ మెగా టోర్నీలో టీమిండియాకు సూర్య కీలక ప్లేయర్గా మారే ఛాన్సుంది.