Asia Cup 2025: క్రికెట్‌లో అలాంటి కామెంట్స్ వద్దు.. ఫైనల్‌కు ముందు సూర్యకు ఐసీసీ వార్నింగ్

Asia Cup 2025: క్రికెట్‌లో అలాంటి కామెంట్స్ వద్దు.. ఫైనల్‌కు ముందు సూర్యకు ఐసీసీ వార్నింగ్

ఆసియా కప్ ఫైనల్ కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ని ఐసీసీ హెచ్చరించింది. టోర్నీ లీగ్ మ్యాచ్ లో భాగంగా సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 'పహల్గామ్' ఎటాక్ కు గురైన బాధితుల గురించి మాట్లాడాడు. క్రికెట్ లో రాజకీయానికి సంబంధించిన కామెంట్స్ చేసినందుకు ఐసీసీ నుంచి టీమిండియా కెప్టెన్ వార్నింగ్ అందుకున్నాడు. పాకిస్తాన్‌పై ఇండియా విజయం సాధించిన తర్వాత ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత సాయుధ దళాలకు తమ గెలుపును అంకితం చేస్తున్నట్టు సూర్య తెలిపాడు. సూర్యకుమార్ వ్యాఖ్యలు "రాజకీయ"మని పీసీబీ ఆరోపించి అతనిపై ఫిర్యాదు చేసింది. 

గురువారం (సెప్టెంబర్ 25) మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ నిర్వహించిన ఐసీసీ విచారణకు సూర్యకుమార్ హాజరయ్యాడు. ఈ విచారణలో సూర్యకుమార్‌తో పాటు బీసీసీఐ COO హేమాంగ్ అమీన్, క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ సుమీత్ మల్లపుర్కర్ పాల్గొన్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సూర్యపై దాఖలు చేసిన ఫిర్యాదుపై గ్లోబల్ బాడీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ క్రికెట్ లో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు గురువారం (సెప్టెంబర్ 25) సూచించారు. సూర్యకు ఇంకా ఎలాంటి శిక్షను నిర్ధారించలేదు. అతని మ్యాచ్ ఫీజ్ లో 15 శాతం పెనాల్టీ విధించే అవకాశం ఉంది.
 
పాకిస్థాన్ తో మ్యాచ్ తర్వాత సూర్య ఏమన్నాడంటే..?
 
ఆసియా కప్ లో పాకిస్థాన్ పై లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఇండియా అలవోక విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్య మాట్లాడుతూ.. ఇలా అన్నాడు. "పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు మేము అండగా నిలుస్తున్నాము . మా సంఘీభావం తెలియజేస్తున్నాము. పాకిస్థాన్ పై ఈ విజయాన్ని మన సాయుధ దళాలన్నింటికీ అంకితం చేయాలనుకుంటున్నాము. వారు  ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించారు. వారు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాము." అని పాకిస్తాన్‌పై విజయం తర్వాత సూర్య అన్నాడు. 

 హరిస్ రౌఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్ లపై నేడు తీర్పు:

ఇండియాపై సూపర్-4 మ్యాచ్ లో భాగంగా  హరిస్ రౌఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్ తమ సైగలతో వివాదాల్లో ఇరుక్కున్నారు. రౌఫ్, ఫర్హాన్ లపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరూ రెచ్చగొట్టే హావభావాలు ప్రదర్శించారని ఐసీసీకి బీసీసీఐ బుధవారం (సెప్టెంబర్ 24) అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఐసీసీకి బీసీసీఐ ఈ-మెయిల్ రూపంలో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఇద్దరు పాక్ క్రికెటర్లపై శుక్రవారం (సెప్టెంబర్ 26) విచారణ జరగనుంది.