సూర్య మెరిసిండు.. మూడో టీ20లో ఇండియా విజయం

సూర్య మెరిసిండు.. మూడో టీ20లో ఇండియా విజయం

ప్రావిడెన్స్‌‌‌‌ (గయానా):  వెస్టిండీస్​ టూర్​లో టీమిండియా స్టార్​ సూర్యకుమార్​ యాదవ్‌‌‌‌ (44 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 83) ఎట్టకేలకు ఫామ్​లోకి వచ్చాడు. టీ20 సిరీస్‌‌‌‌లో ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో తన మార్కు మెరుపులు చూపెట్టాడు. అతనికి తోడు హైదరాబాదీ తిలక్‌‌‌‌ వర్మ (37 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 49 నాటౌట్‌‌‌‌) కూడా బ్యాట్‌‌‌‌ ఝుళిపించడంతో మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌‌‌‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌‌‌‌పై గెలిచింది. 

ఫలితంగా ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో విండీస్‌‌‌‌ ఆధిక్యాన్ని 2–1కు తగ్గించి ఆశలను సజీవంగా నిలుపుకుంది. టాస్‌‌‌‌ గెలిచిన విండీస్‌‌‌‌ 20 ఓవర్లలో 159/5 స్కోరు చేసింది. బ్రెండన్‌‌‌‌ కింగ్‌‌‌‌ (42 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 42), రొవ్‌‌‌‌మన్‌‌‌‌ పావెల్‌‌‌‌ (19 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌, 3 సిక్స్‌‌‌‌లతో 40 నాటౌట్‌‌‌‌) చెలరేగారు. కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత ఇండియా 17.5 ఓవర్లలో 164/3 స్కోరు చేసింది. సూర్యకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. నాలుగో టీ20 శనివారం లాడర్‌‌‌‌హిల్‌‌‌‌లో జరుగుతుంది. 

కింగ్‌‌‌‌, పావెల్‌‌‌‌ జోరు

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన విండీస్‌‌‌‌ను కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ దెబ్బకొట్టినా, చివర్లో పావెల్‌‌‌‌ సుడిగాలి ఇన్నింగ్స్‌‌‌‌తో ఇండియా ముందు మంచి టార్గెట్‌‌‌‌ను పెట్టాడు. స్టార్టింగ్‌‌‌‌లో ఓపెనర్లు కింగ్‌‌‌‌, మేయర్స్‌‌‌‌ (25) తొలి నాలుగు ఓవర్లలోనే 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 30 రన్స్‌‌‌‌ రాబట్టారు. కానీ తర్వాతి రెండు ఓవర్లలో ఒకే ఫోర్‌‌‌‌ రావడంతో పవర్‌‌‌‌ప్లేలో హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ 38/0 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌‌‌‌లో కుల్దీప్‌‌‌‌ 4, 6 ఇచ్చినా, తర్వాతి ఓవర్‌‌‌‌లో అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (1/24) తొలి దెబ్బ కొట్టాడు. 

మేయర్స్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి తొలి వికెట్‌‌‌‌కు 55 రన్స్‌‌‌‌ పార్ట్​నర్​షిప్​ ముగించాడు. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో  వచ్చిన జాన్సన్‌‌‌‌ చార్లెస్‌‌‌‌ (12).. 6, 4 కొట్టడంతో తొలి 10 ఓవర్లలో విండీస్‌‌‌‌ 73/1 స్కోరు చేసింది. ఇక్కడి నుంచి కుల్దీప్‌‌‌‌ మంచి టర్నింగ్‌‌‌‌తో కరీబియన్లను కట్టడి చేశాడు. 11వ ఓవర్‌‌‌‌లో చార్లెస్‌‌‌‌ను ఎల్బీ చేసిన అతను15వ ఓవర్‌‌‌‌లో డబుల్‌‌‌‌ ఝలక్‌‌‌‌ ఇచ్చాడు. 6, 4, 4, 4తో జోరు చూపెట్టిన పూరన్‌‌‌‌ (20), కింగ్‌‌‌‌ను ఐదు బాల్స్‌‌‌‌ తేడాలో ఔట్‌‌‌‌ చేశాడు. ఫలితంగా విండీస్‌‌‌‌ స్కోరు 106/4గా మారింది. ఈ దశలో పావెల్‌‌‌‌ మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు. హెట్‌‌‌‌మయర్‌‌‌‌ (9)తో ఐదో వికెట్‌‌‌‌కు 17, షెపర్డ్‌‌‌‌ (2 నాటౌట్‌‌‌‌)తో ఆరో వికెట్‌‌‌‌కు 36 రన్స్‌‌‌‌ జోడించి విండీస్​ స్కోరు 150 దాటించాడు.   

ఇద్దరూ.. ఇద్దరే

ఛేజింగ్‌‌‌‌లో ఇండియాకు తొలి ఓవర్‌‌‌‌లోనే గట్టి దెబ్బ తగిలినా.. ముంబై ఇండియన్స్‌‌‌‌ టీమ్​మేట్స్​ సూర్య, తిలక్‌‌‌‌  దంచికొట్టారు. ఇన్నింగ్స్‌‌‌‌ నాలుగో బాల్‌‌‌‌కు అరంగేట్రం కుర్రాడు యశస్వి జైస్వాల్‌‌‌‌ (1) ఔటయ్యాడు. 6/1 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన సూర్య వెంటవెంటనే 4, 6, 4, 4తో రెచ్చిపోయాడు. కానీ ఐదో ఓవర్‌‌‌‌లో గిల్‌‌‌‌ (6) వెనుదిరగడంతో ఇండియా 34/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో తిలక్‌‌‌‌ వరుస ఫోర్లు కొడితే, ఆరో ఓవర్‌‌‌‌లో సూర్య 6, 4 బాదడంతో పవర్‌‌‌‌ప్లేలో ఇండియా 60/2 స్కోరు చేసింది. 

ఆ వెంటనే మరో మూడు ఫోర్లు కొట్టిన సూర్య 23 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌‌‌ చేశాడు. 10వ ఓవర్‌‌‌‌లో సూర్య తన ట్రేడ్‌‌‌‌ మార్క్‌‌‌‌ 6, 4 కొట్టడంతో తొలి 10 ఓవర్లలో స్కోరు 97/2కు పెరిగింది. ఇక్కడి నుంచి తిలక్‌‌‌‌ స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేస్తే సూర్య బౌండ్రీల జోరు చూపెట్టాడు. రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌ కొట్టి 13వ ఓవర్‌‌‌‌లో లాంగాన్‌‌‌‌లో కింగ్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. దాంతో మూడో వికెట్‌‌‌‌కు 87 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. 42 బాల్స్‌‌‌‌లో 37 రన్స్‌‌‌‌ చేయాల్సిన దశలో హార్దిక్‌‌‌‌ పాండ్యా (20 నాటౌట్‌‌‌‌), తిలక్‌‌‌‌ ఈజీగా లక్ష్యాన్ని అందుకున్నారు. పాండ్యా  సిక్స్​తో మ్యాచ్​ ముగించడంతో తిలక్​ వరుసగా రెండో ఫిఫ్టీకి ఒక్క రన్​ దూరంలో నిలిచిపోయాడు.

సంక్షిప్త స్కోర్లు :  వెస్టిండీస్‌‌‌‌: 20 ఓవర్లలో 159/5 (బ్రెండన్‌‌‌‌ కింగ్‌‌‌‌ 42, పావెల్‌‌‌‌ 40*, కుల్దీప్‌‌‌‌ 3/28). ఇండియా: 17.5 ఓవర్లలో 164/3 (సూర్య 83, తిలక్‌‌‌‌ 49*, జోసెఫ్‌‌‌‌ 2/25).