గల్లీ క్రికెట్లోనే 360 డిగ్రీల్లో ఆడటం నేర్చుకున్నా:సూర్యకుమార్ యాదవ్

గల్లీ క్రికెట్లోనే 360 డిగ్రీల్లో ఆడటం నేర్చుకున్నా:సూర్యకుమార్ యాదవ్

ముంబై ఇండియన్స్‌కు ఆడటమే తన కెరీర్ మలుపు తిప్పిందని టీమిండియా 360 డిగ్రీ ప్లేయర్  సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ముంబై తరపున టాపార్డర్లో ఆడటం వల్లే  ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాడు. టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించడం  కలగా ఉందన్నాడు. గల్లీ క్రికెట్‌తోనే 360 డిగ్రీల ఆటను నేర్చుకున్నానని సూర్య వెల్లడించాడు. 

కోహ్లీ, రోహిత్ల ప్రోత్సాహమే సక్సెస్‌కు కారణం..

కోహ్లీ, రోహిత్‌శర్మతో కలిసి డ్రెస్సింగ్‌రూమ్‌ పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని సూర్యకుమార్ తెలిపాడు. విరాట్‌ ఆడటాన్ని  తాను ఎంతో ఆస్వాదిస్తానని చెప్పాడు. రోహిత్‌ పెద్ద అన్న లాంటి వాడన్నాడు. ముంబై ఇండియన్స్‌లో చేరినప్పటి నుంచి రోహిత్ శర్మ తన మార్గనిర్దేశకుడిగా ఉన్నాడని సూర్య చెప్పుకొచ్చాడు.

360 ఆటకు అదే కారణం. 

క్రికెట్లో 360 డిగ్రీల్లో షాట్లు ఆడడం వెనుక ఆసక్తికరమైన కథ ఉందని సూర్య తెలిపాడు. స్కూల్, కాలేజీ రోజుల్లో క్రికెట్‌ అంతా ఎక్కువగా రబ్బరు బాల్తోనే ఆడేవాడినన్నాడు. వానలోనే ఎన్నో మ్యాచ్‌లు ఆడేవాళ్లమని... ఇలాంటప్పుడు బాల్  ఇష్టం వచ్చినట్లు దూసుకొచ్చేదన్నాడు. ఒక్కోసారి బౌన్స్‌ అవుతూ ఎక్కువ ఎత్తులో వెళ్లేదని తెలిపాడు. ఆఫ్‌సైడ్‌ ఫోర్లు కొట్టకుండా శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బంతులు వేసేవాళ్లన్నాడు. ఈ సమయంలోనే విభిన్నమైన టెక్నిక్‌లు నేర్చుకున్నానని చెప్పాడు. క్రీజులో స్వేచ్ఛగా కదులుతూ.. శరీరాన్ని ఎటు కావాలంటే అటు తిప్పుతూ స్విచ్‌ షాట్లు, రివర్స్‌ స్వీప్‌లు, అప్పర్‌ కట్‌లతో బౌండరీలు కొట్టేవాడినన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇదే కొనసాగిస్తున్నట్లు చెప్పాడు. 

నెంబర్ వన్ ర్యాంకు కలగా ఉంది..

టీ20ల్లో నెం.1 ర్యాంకు ఇప్పటికీ కలగా అనిపిస్తుందని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఈ ట్యాగ్‌ను నమ్మలేకపోతున్నానని చెప్పాడు. టీ20ల్లోకి వచ్చినప్పటి నుంచి గొప్పగా ఆడాలని అనుకున్నానని..అందుకు శ్రమించానన్నాడు. ఇప్పుడు ప్రతిఫలాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం 2023 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి పెడుతున్నానని... ఇందుకోసం గేమ్‌లో మార్పులేమి చేసుకోననని వెల్లడించాడు. ఫార్మాట్ ఏదైనా..ఒకటే ఆట అని..బ్యాటింగ్ ను ఆస్వాదిస్తానన్నాడు. బరిలోకి దిగితే ఆలరించడమే లక్ష్యంగా ఆడతానని చెప్పాడు. 

టెస్టుల్లో ఆడేందుకు ఎదురుచూస్తున్న..

టెస్టుల్లో టీమిండియాకు ఆడాలనేది కోరిక అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. క్రికెటర్లకు సవాల్‌ను విసిరే ఐదు రోజుల ఆట అంటే చాలా ఇష్టమన్నాడు. ఆస్ట్రేలియాతో రాబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో  జట్టుకు ఎంపికైతే ఆడతానన్నాడు.  టీమిండియా తరఫున అరంగేట్రం చేయడానికి ముందు పదేళ్లు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడానని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.