- సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, వెలుగు: యువత కేవలం ఉద్యోగాల కోసమే ఎదురుచూడకుండా, పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టి స్వయం ఉపాధిని సృష్టించుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపారవేత్తల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. నిబద్ధత, కృషితో వ్యాపారంలో ఎదురయ్యే వైఫల్యాలను గుణపాఠాలుగా మలుచుకొని విజయవంతమైన వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
