తాళ్లసింగారం ఎస్​బీఐలోస్కామ్

తాళ్లసింగారం ఎస్​బీఐలోస్కామ్
  • ఎస్‌హెచ్‌జీ, అగ్రికల్చర్ లోన్ల పేరుతో రూ.2.85 కోట్లు బదిలీ 
  • బంధువుల అకౌంట్లలోకి ట్రాన్స్​ఫర్​ చేసిన మేనేజర్​
  • ఆడిట్​లో బయటపడ్డ నిజం 
  • 14మందిపై కేసు నమోదు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో ఎస్​బీఐ బ్యాంక్ మేనేజర్ రూ.4.5 కోట్ల కాజేసిన ఘటన మరవక ముందే జిల్లాలోని మరో ఎస్బీఐ బ్రాంచ్​లో ఇంకో స్కామ్ వెలుగులోకి వచ్చింది. సమభావన సంఘాలు, వ్యవసాయ రుణాలు, ముద్ర లోన్ల పేరిట అక్రమంగా రుణాలు తీసుకున్న ఓ మేనేజర్​తన బంధువుల అకౌంట్లలోకి  రూ.2.85 కోట్ల నగదును మళ్లించాడు. మూడు నెలల క్రితం బ్యాంక్ లో నిర్వహించగా ఈ గుట్టు బయటపడింది. రికవరీకి టైం ఇచ్చినా కట్టకపోవడంతో మంగళవారం పీఎస్​లో  ఫిర్యాదు చేశారు.  

సమ భావనా సంఘాల పేరుతో లోన్లు

నూతనకల్ మండల తాళ్ల సింగారం బ్యాంక్​మేనేజర్​గా పని చేసిన హరిప్రసాద్ బ్యాంక్ సమీపంలోని ఆధార్ సెంటర్ నిర్వాహకులు, ఔట్ సౌర్సింగ్ సిబ్బంది, ఎఫ్‌ఓ‌ఎస్ (ఫైనాన్షియల్​అంబుడ్స్​మెన్)తో కలిసి నకిలీ డ్యాక్యుమెంట్లు పెట్టి ఎస్‌హెచ్‌జీ(సెల్ఫ్​ హెల్ప్​ గ్రూప్స్​), అగ్రికల్చర్, ముద్ర లోన్ల పేరిట లోన్లు తీసుకున్నాడు. ఇలా వచ్చిన రూ.2.85కోట్లను తన బంధువుల ఖాతాల్లోకి బదిలీ చేశాడు. వీటిలో ఎస్‌హెచ్‌జీ పేరిట రూ.1.30కోట్లు, అగ్రికల్చర్ లోన్లు రూ.65లక్షలు, ముద్ర లోన్లు రూ.90లక్షలు తీసుకున్నాడు. 

ప్రతి నెలా ఈఎంఐ చెల్లిస్తుండగా  ఎఫ్‌ఓ‌ఎస్ సహాయం చేసేవాడు. మూడు నెలల కింద ఆడిట్ ​నిర్వహించగా గుట్టు రట్టయ్యింది. ఎంక్వైరీ చేయగా నకిలీ డ్యాక్యుమెంట్లతో పాటు నకిలీ ఇన్ వాయిస్ లతో లేని యూనిట్ల పేరిట లోన్లు తీసుకున్నట్టు తేలింది. బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్​తో పాటు మరో 13మందికి సంబంధమున్నట్టు గుర్తించారు. మూడు నెలల్లోపు రూ.2.85 కోట్లు  చెల్లించాలని నోటీసులిచ్చారు. మేనేజర్,  ఎఫ్‌ఓ‌ఎస్, ఔట్ సౌర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. 

14మందిపై కేసు నమోదు 

అవకతవకలపై తాళ్లసింగారం ఎస్​బీఐలో ప్రస్తుత  మేనేజర్ రవీందర్ నూతన్ కల్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు 14మందిపై కేసు నమోదు చేశారు.  హరిప్రసాద్ హైదరాబాద్ లో ఉన్నారని, త్వరలో 14మందిని అదుపులోకి తీసుకుంటామని ఎస్సై సైదులు తెలిపారు.